మక్తల్/మాగనూర్, వెలుగు : కృష్ణా నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు. కృష్ణా రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల నేడు సకారం అయిందని హర్షం వ్యక్తం చేశారు.
రైల్వే ట్రాక్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో రోజులుగా ట్రైన్ సర్వీస్ ఈ ప్రాంతంలో ఉండాలనే కోరిక తన హయంలో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణా నుంచి మక్తల్ వరకు ట్రైన్ లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం మనీష్ అగర్వాల్, కృష్ణా మండల పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.