
ఛత్తార్‌పూర్ (మధ్యప్రదేశ్): మనోళ్లే కొందరు.. విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహాకుంభ మేళా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహా కుంభమేళాను ఉద్దేశిస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మోదీ ఘాటుగా స్పందించారు. హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా హిందూ సంస్కృతిపై విషం కక్కుతున్నారని ఫైర్ అయ్యారు.
బానిస మనస్తత్వం కలిగిన వీళ్లంతా.. మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారన్నారు. మన పండుగలు, ఆచారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్‌కు మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కొందరు పనిగట్టుకుని మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఒక్కరితో సాధ్యం కాకపోవడంతో విదేశీ శక్తుల సహకరం తీసుకుంటున్నరు. దేశ ప్రజలను మతం, కులం, వర్గం, జాతి పేరుతో విభజిస్తున్నరు.
హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటున్నరు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వాళ్ల ప్రధాన ఎజెండా. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటది. కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాకు తరలివస్తున్నారు’’అని మోదీ తెలిపారు. కాగా, మహా కుంభమేళా అనేది మృత్యు కుంభ్ మేళా అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల విమర్శించారు. అఖిలేష్ యాదవ్, మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర విమర్శలు చేశారు.
సఫాయి కార్మికులు, పోలీసులకు ధన్యవాదాలు
మహాకుంభ మేళాలో వేలాది మంది సఫాయి కార్మికులు, పోలీసులు సేవలు అందిస్తున్నారని మోదీ తెలిపారు. వారందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగను విజయవంతం చేయడంలో సఫాయి కార్మికులు, పోలీసులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘‘వేలాది మంది డాక్టర్లు, వాలంటీర్లు ఎంతో డెడికేషన్‌తో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తితో పని చేశారు. మేళాలో సేవలందించిన కంటి వైద్య నిపుణులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎన్నో యుగాల నుంచి హిందూ మఠాలు, ధామాలు, ఆలయాలు అనేవి.. విశ్వాసాలు, సైన్స్, పరిశోధనలకు కేంద్రాలుగా పని చేస్తున్నాయి. సాధువులు.. యోగా, సైన్స్ జ్ఞానాన్ని అందించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మనమే.. మన పూర్వీకులు.. ఇండియా అంటే గర్వపడేలా చేశారు. అన్ని దేశాల్లో మన జెండాను ఎగిరేలా చేశారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు దీనికి సబ్ కా ఇలాజ్.. సబ్ కో ఆరోగ్య’ జోడిస్తున్నాం. ప్రజలు క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి.