
మెదక్, తూప్రాన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తుప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో జరిగే బీజేపీ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. శనివారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ అధికారులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మెదక్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడారు.
ప్రధాన మంత్రి మోదీ పాల్గొనే ఎన్నికల ప్రచార సభకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ మెదక్ అభ్యర్థి విజయ్ కుమార్, మెదక్ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి ఈశ్వర్ సింగ్ ఠాగూర్, పార్టీ జిల్లా కార్యదర్శులు విజయ్, సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్, అధికార ప్రతినిధి నందారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మధు, మహిళా నాయకురాలు వీణ ఉన్నారు.