
- బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా బ్యాంకాక్‌లో సమావేశం
- బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ
- సంబంధాలను చెడగొట్టే కామెంట్స్ చేయొద్దని సూచన
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన 6వ బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. ఇటీవల చైనా పర్యటనలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొన్నది.
కాగా, షేక్‌హసీనా గద్దె దిగిన తర్వాత తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన యూనస్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోదీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రతపై ఆందోళనను యూనస్ దృష్టికి మోదీ తీసుకెళ్లారు. ఈశాన్య రాష్ట్రాలపై యూసన్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని మోదీ సూచించారు.
ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు ప్రాధాన్యం
యూనస్‌తో మోదీ భేటీ వివరాలను భారత విదేశాంగ ప్రతినిధి మిస్రీ వెల్లడించారు. ‘‘ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కే భారత్ మద్దతు ఉంటుందని యూనస్‌కు తెలిపారు. బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటుందని మోదీ తెలియజేశారు” అని మిస్రీ వివరించారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణపై ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో తమ సంబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నట్టు మోదీకి యూనస్ తెలియజేశారని పేర్కొన్నది. 1971లో అత్యంత సవాల్‌తో కూడిన సమయంలో భారత ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిన అచంచలమైన మద్దతుకు తాము కృతజ్ఞులై ఉన్నామని యూనస్ అన్నట్టు తెలిపింది.
శ్రీలంకకు బయలుదేరిన మోదీ
ప్రధాని మోదీ థాయ్‌లాండ్ నుంచి మూడు రోజుల పర్యటన కోసం శ్రీలంకకు బయలుదేరారు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మోదీ కొలంబోకు పయనమయ్యారు. 2019లో ప్రధాని మోదీ చివరిసారిగా శ్రీలంకలో పర్యటించారు.