యువత కోసమే సంస్కరణలు.. అభివృద్ధి వైపు అడుగులు: ప్రధాని మోడీ
అన్ని రంగాల అభివృద్ధి కోసం మార్పులు
ఈ దశాబ్దం ఇండియాదిగా మారాలి
మైసూరు వర్సిటీ కాన్వొకేషన్‌లో పీఎం కామెంట్స్
మైసూరు: ‘‘ప్రతి రంగంలో అభివృద్ధిని సాధించేందుకు, ఈ దశాబ్దం ఇండియాదిగా మార్చేందుకు అవసరమైన మార్పులు చేస్తున్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్‌కు గ్లోబల్ హబ్‌గా ఇండియాను మార్చేందుకు, దాన్ని యువతకు పోటీగా చేసేందుకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ‘‘గత ఆరేడు ఏళ్లుగా అన్ని రంగాల్లో వేగంగా చేపట్టిన సంస్కరణల గురించి మీరు గమనించే ఉంటారు. అది అగ్రికల్చర్ కావచ్చు.. స్పేస్, డిఫెన్స్, ఏవియేషన్ లేదా లేబర్ కావచ్చు.. ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధికి అవసరమైన మార్పులు చేపట్టాం. కోట్లాది మంది యువత కోసమే ఈ ఇదంతా చేస్తున్నాం” అని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ సెంటినరీ కాన్వొకేషన్ సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘ఈ దశాబ్దం ఇండియాదే కావాలి. అయితే పునాదులు గట్టిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. యంగ్ ఇండియాకు ఈ దశాబ్దం ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది” అని మోడీ చెప్పారు. ‘‘దేశంలో ఇప్పుడు ఆల్‌రౌండ్ సంస్కరణలు జరుగుతున్నాయి. ఇలా ఎన్నడూ జరగలేదు. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా.. అవి ఏదో ఒక్క రంగానికే పరిమితమయ్యేవి. ఇతరులను పట్టించుకునే వారు కాదు” అని అన్నారు.
ఆరేండ్లలో ఎన్నో..
గత ఆరేళ్లలో ఎన్నో రీఫార్మ్స్ తీసుకొచ్చామని మోడీ అన్నారు. ‘‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ.. ఎడ్యుకేషన్ సెక్టార్ ఫ్యూచర్‌కు భరోసా కల్పిస్తుంది. వ్యవసాయ సంస్కరణలు.. రైతులను ఎంపవర్ చేస్తాయి. ఇక లేబర్ రీఫార్మ్స్.. వృద్ధికి, కార్మికులు, పరిశ్రమల భద్రతకు ప్రాధాన్యం ఇస్తాయి” అని వివరించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఆర్ఈఆర్ఏ)తో ఇండ్లు కొనేవాళ్లకు రక్షణ వస్తుందని తెలిపారు. రకరకాల పన్నుల బాధ నుంచి కాపాడేందుకు జీఎస్టీ తెచ్చామన్నారు.
ఇన్స్టిట్యూట్లు పెంచడమే కాదు..
21వ శతాబ్దం అవసరాలకు అనుగుణంగా స్టూడెంట్లను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీర్చిదిద్దేలా గత ఐదారేండ్లలో స్థిరమైన ప్రయత్నాలు జరిగాయని మోడీ చెప్పారు. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ల సంఖ్యను గత ఆరేళ్లలో పెంచామని గుర్తుచేశారు. ‘‘కేవలం కొత్త ఇన్స్టిట్యూషన్లను ఓపెన్ చేయడమే కాదు. పరిపాలనలో సంస్కరణల వైపు.. లింగ, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచే దిశగా, విద్యాసంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి ఇచ్చేలా ఉన్నత విద్యా రంగంలో మార్పులు చేస్తున్నాం. వైద్య విద్యలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నాం’’ అని చెప్పారు.
స్కిల్.. చాలా అవసరం
మైసూరు విశ్వవిద్యాలయం, దాని గొప్ప వారసత్వాన్ని మోడీ ప్రశంసించారు. నాటి మైసూరు మహారాజు నల్వాడి కృష్ణరాజ వడియార్, దివాన్, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విజన్‌ను గుర్తు చేసుకున్నారు. మైసూరు వర్సిటీ తొలి కాన్వొకేషన్ సందర్భంగా ‘మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి’ అని వడియార్ చేసిన కామెంట్లను ప్రధాని ప్రస్తావించారు. ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో అన్ని స్థాయిల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల ఎన్రోల్మెంట్ రేషియో ఎక్కువగా ఉందని చెప్పారు. ‘‘స్కిల్ పెంచుకోవడం, మళ్లీ పెంచుకోవడం, మరింత పెంచుకోవడమే.. ఇప్పుడు ముఖ్యమైన అవసరం. దీనిపైనే ఎడ్యుకేషన్ పాలసీ ఫోకస్ చేస్తుంది” అని ప్రధాని చెప్పారు.
ఆంక్షలున్నా.. పండుగ పండుగే
నాడా హబ్బా(రాష్ట్ర పండుగ) దసరా సందర్భంగా కర్నాటక ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. కరోనా నేపథ్యంలో పలు ఆంక్షలు ఉంటాయని, కానీ పండుగ స్ఫూర్తి మాత్రం గతంలో మాదిరే ఉంటుందని చెప్పారు. ఈమధ్య రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వచ్చిన వరదలు పండుగ స్ఫూర్తిని తగ్గించడానికి ప్రయత్నించా యని అన్నారు. ‘‘వరద ప్రభావిత ప్రాంతాల వారికి నా సానుభూతి. కేంద్ర ప్రభుత్వం, కర్నాటక సర్కారు.. అన్నివిధాలుగా సహాయక చర్యలు కొన సాగిస్తున్నాయి” అని చెప్పారు. ప్రోగ్రామ్‌లో కర్నాటక గవర్నర్ వాజుభాయ్ వాలా, డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వనాథ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
For More News..