జమ్మూ కాశ్మీర్​కు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా : ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్​కు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా : ప్రధాని మోదీ
  • రాష్ట్ర హోదాపై సీఎం ఒమర్  ప్రశ్నకు పరోక్ష సమాధానం
  • జమ్మూ కాశ్మీర్​దేశానికి కిరీటం.. అదెప్పుడూ అందంగా ఉండాలి
  • గాందర్బల్​ జిల్లాలో జడ్​ మోడ్​ టన్నెల్​ను ప్రారంభోత్సవంలో మోదీ

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్​కు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన పనులన్నీ జరుగుతాయని అన్నారు. ప్రధాని మోదీ అన్ని హామీలు నెరవేరుస్తున్నారని, ఇదే క్రమంలో జమ్మూ కాశ్మీర్​కు ప్రత్యేక రాష్ట్ర హోదా హామీని కూడా తీరుస్తారని తాను విశ్వసిస్తున్నట్టు  సీఎం ఒమర్​అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై మోదీ పరోక్షంగా స్పందించారు.

ప్రతిదానికి ఓ సరైన సమయం ఉంటుందని జవాబిచ్చారు. సోమవారం జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌ లో మోదీ పర్యటించారు.  ఇక్కడి గాందర్‌‌‌‌‌‌‌‌బల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నిర్మించిన  జడ్‌‌‌‌‌‌‌‌–-మోడ్‌‌‌‌‌‌‌‌  టన్నెల్​ను ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌‌‌‌‌‌‌‌ లోపలికి వెళ్లి పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో ముచ్చటించారు.  టన్నెల్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేయడానికి కఠినమైన పరిస్థితుల మధ్య  పనిచేసిన కార్మికులను కలిశారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్​ లెఫ్టినెంట్‌‌‌‌‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌ మనోజ్‌‌‌‌‌‌‌‌ సిన్హా, సీఎం ఒమర్‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా, కేంద్రమంత్రి నితిన్‌‌‌‌‌‌‌‌ గడ్కరీ తదితరులున్నారు. 

జమ్మూ కాశ్మీర్​ సుభిక్షంగా ఉండాలి

దేశానికే జమ్మూ కాశ్మీర్​ కిరీటమని, అది ఎప్పుడూ అందంగా, సుభిక్షంగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్​లో శాంతియుత వాతావరణం నెలకొన్నదని, పర్యాటకంపై దాని ప్రభావాన్ని చూశామని అన్నారు. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు. కాశ్మీర్ లోయను త్వరలోనే రైలుతో అనుసంధానిస్తామని, దీనిపై దేశ ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారని అన్నారు.  నిరుడు అక్టోబర్ 20న ఇక్కడి టన్నెల్​ సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఏడుగురికి మోదీ నివాళులర్పించారు. 

చీకట్లో నుంచి బయటకు తెచ్చారు: ఎల్జీ సిన్హా

జమ్మూ కాశ్మీర్​ను ప్రధాని మోదీ నిరాశ అనే చీకటినుంచి బయటకు తెచ్చారని, ఉజ్వల భవిష్యత్తుకు మార్గాన్ని వేశారని లెఫ్టినెట్ గవర్నర్​ మనోజ్​సిన్హా అన్నారు. జమ్మూ కాశ్మీర్​ చరిత్రలోనే జడ్​–మోడ్​ టన్నెల్ ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పారు. కాగా, టన్నెల్​ను ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి జమ్మూ కాశ్మీర్​ సీఎం ఒమర్​ అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హోదా హామీని కూడా ప్రధాని మోదీ త్వరలోనే నెరవేరుస్తారనే నమ్మకం తనకుందన్నారు.  

జడ్​–మోడ్​ టన్నెల్​ ప్రత్యేకతలివే..

జడ్​మోడ్​ టన్నెల్​ను జమ్మూకాశ్మీర్​లోని శ్రీనగర్​– లేహ్​నేషనల్​ హైవేపై సోన్​మార్గ్​ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. రూ. 2,700 కోట్ల వ్యయం చేశారు. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో, 6.4 కిలో మీటర్ల పొడవుతో నిర్మించారు. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. దీనివల్ల సోన్‌‌‌‌‌‌‌‌మార్గ్‌‌‌‌‌‌‌‌కు పర్యాటకుల రాకకూడా పెరగనున్నది.