ఇది ఎన్నికల సభ కాదు.. అభివృద్ధి ఉత్సవసభ : మోదీ


దేశ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదిలాబాద్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శని స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ..  ఇది ఎన్నికల సభ కాదు...అభివృద్ధి ఉత్సవసభ  అని చెప్పుకొచ్చారు. బీజేపీ రాకముందు ఆదివాసి మహిళా రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా అని మోదీ ప్రశ్నించారు. ఆదివాసుల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పని చేస్తుందన్నారు.  

దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టామన్నారు మోదీ.  ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదన్నారు.  మీరంతా వికసిత్‌ భారత్‌ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని... మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ మోదీ మాట్లాడారు. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్‌ ఐటీ, ఒక ఐఐఎస్‌ను ప్రారంభించామని తెలిపారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.  

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు ప్రధాని మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టులో అవీనితి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందని నిలదీశారు.  కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దన్నారు.  కుటుంబ పార్టీలలో రెండే అంశాలు ఉంటాయన్న మోదీ...ఒకటి దోచుకోవడం అయితే మరోకటి అబద్దాలు చెప్పడమేనని విమర్శించారు.  బీఆర్ఎస్‌ పాలనలో ప్రజలకు జరిగిందేమీ లేదన్న మోదీ..  కాంగ్రెస్‌ పాలనలో కూడా ప్రజలకు ఏమీ జరగదన్నారు.  తన జీవితం తెరిచిన పుస్తకమని .. తన జీవితం దేశానికి అంకితమని చెప్పుకొచ్చారు.  తెలంగాణ ప్రజల ఆంక్షాలను నెరవేర్చడమే తన లక్ష్యమని తెలిపారు మోదీ.