- మాస్కోలో భారత ప్రధానికి సాదర స్వాగతం
- అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రెండురోజుల పర్యటన
- అనంతరం ఆస్ట్రియాకు మోదీ పయనం
మాస్కో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. సోమవారం సాయంత్రం మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆయనకు సాదర స్వాగతం లభించింది. మోదీకి వెల్కం చెబుతూ రెడ్ స్క్వేర్ ముందు రష్యన్ మహిళలు పంజాబీ దుస్తులతో భాంగ్రా నృత్యం ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానంపై మోదీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఇరుదేశాధినేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
రష్యా, ఇండియా మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే, రష్యా మిలిటరీకి సహాయక సిబ్బందిగా ఇండియన్స్ రిక్రూట్‌మెంట్ కు స్వస్తి పలకాలని, ఆ దళంలో పనిచేస్తున్న వారు స్వదేశానికి తిరిగి వచ్చేలా చూడాలని పుతిన్‌ను మోదీ కోరనున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా మోదీ కోసం పుతిన్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం మోదీ ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. కాగా, దాదాపు ఐదేండ్ల తర్వాత మోదీ రష్యా గడ్డపై అడుగుపెట్టారు. 2019లో రష్యాలోని వ్లాదివోస్టిక్లో జరిగిన ఆర్థిక సమావేశానికి ఆయన హాజరయ్యారు. రష్యా పర్యటన ముగించుకొని మోదీ.. ఆస్ట్రియా దేశానికి బయలుదేరుతారు.
రష్యాతో ప్రత్యేక, విశేష భాగస్వామ్యం: మోదీ
రష్యా బయలుదేరేముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పదేండ్లుగా ఇంధనం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య పరస్పర మార్పిడి వంటి అంశాలతో సహా భారత్, రష్యాల మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యంఅభివృద్ధి చెందిందని చెప్పారు.
“నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించేందుకు ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే, తన టూర్ వివరాలను మోదీ ట్వీట్ చేశారు. “రాబోయే 3 రోజులు రష్యా, ఆస్ట్రియాలో పర్యటిస్తాను. ఆ దేశాలతో సంబంధాలను మరింత పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారత్‌కు ఆస్ట్రియా దృఢమైన, విశ్వసనీయ భాగస్వామి” అని పేర్కొన్నారు. ఆస్ట్రియాలో ఆ దేశ అధ్యక్షడు అలెగ్జాండర్ వాన్‌డెర్ బెల్లెన్, చాన్స్‌లర్ కార్ల్ నెహమ్మర్‌ను కలిసే అవకాశం ఉందని చెప్పారు.
ప్రవాసుల ఎదురుచూపు
మోదీని కలిసి, ముచ్చటించేందుకు రష్యాలోని ఇండియన్ కమ్యునిటీ ఎదురుచూస్తున్నది. ఈ సందర్భంగా ఆయన ఎదుట పలు వినతులు చేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యాలో హిందూ ఆలయ నిర్మాణం, ఇండియన్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణంతోపాటు రష్యా నుంచి భారత్‌కు నేరుగా ఎక్కువ సంఖ్యలో ఫ్లైట్స్ నడపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.