70 ఏళ్ల కల సాకారం.. కునో నేషనల్ పార్కులోకి చీతాలు

 70 ఏళ్ల కల సాకారం.. కునో నేషనల్ పార్కులోకి చీతాలు

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి అధికారికంగా వదిలారు.  బోయింగ్ విమానం బి747 జంబోజెట్లో తీసుకువచ్చిన చిరుత పులులను పార్కులోని ఎన్ క్లోజర్ లో విడిచిపెట్టారు. అనంతరం మోడీ  స్వయంగా ఆ చీతాల ఫోటోలు తీశారు. 

మోడీకి ఘన స్వాగతం..
చీతాలను కునో నేషనల్ పార్క్‌లోకి విడిచిపెట్టేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘన స్వాగతం పలికారు. గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు..ఇతర బీజేపీ నేతలు మోడీని సన్మానించి స్వాగతం చెప్పారు. 

చీతాల గాండ్రింపులు వినపడాలన్న లక్ష్యంతో..
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు  ప్రత్యేకంగా తయారు చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్స్‌లో కొద్దిరోజుల పాటు ఉండనున్నాయి.  రెండు మగ చీతాలను ఒక ఎన్‌క్లోజర్‌లో..ఆడ చీతాని పక్కనే మరో ఎన్‌క్లోజర్‌లో గడపనున్నాయి. 8 చీతాలకు  వ్యాక్సిన్‌లు వేశారు. వాటికి సాటిలైట్ కాలర్‌లు కూడా అమర్చారు. ఇండియాలో చీతాల గాండ్రింపులు మరోసారి వినపడాలన్న లక్ష్యంతో... కేంద్రం ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టును చేపట్టింది. 

70 ఏళ్ల కల సాకారం
దేశంలో తొలిసారిగా 1952లో వైల్డ్‌లైఫ్‌ బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ లో చిరుతల సంఖ్య దారుణంగా పడిపోయిందని నిర్ణయానికి వచ్చారు. దీంతో చీతాల సంఖ్యను పెంచేందుకు  భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక 1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ..ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.  ఆసియా చీతాలను ఇక్కడకు రప్పించాలని..వాటికి బదులుగా ఆసియా సింహాలను ఇచ్చేలా సంప్రదింపులు జరిగాయి. ఈ సంప్రదింపులు ఆ తర్వాత అటకెక్కాయి.  దాదాపు 40 ఏళ్ల తర్వాత అంటే.. 2009లో చర్చలు పున:ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ..ఇందుకు చొరవ చూపారు. మళ్లీ వివిధ కారణాలతో ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం మోడీ హయాంలో చీతాల తరలింపు విజయవంతమైంది. మొత్తానికి భారత్ కు చీతాలు అడుగుపెట్టాయి. 

కునో పల్‌పూర్ నేషనల్ పార్క్కే  ఎందుకు..?
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను కునో పల్‌పూర్ నేషనల్ పార్క్లోనే విడిచిపెట్టడానికి కారణం..పార్కులో..చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీ సెల్సియస్గా నమోదవుతాయి. చలికాలంలో 6 నుంచి 7డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయి. ప్రస్తుతం పార్క్‌లో 21 చీతాలు ఉన్నాయి. తాజాగా 8  చీతాలను తీసుకొచ్చిన నేపథ్యంలో..పార్కులో 36 చీతాలు  ఉండేందుకు అన్ని వసతులు కల్పించారు. పార్కు మొత్తం 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కొత్తగా వచ్చిన చీతాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రెండు అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు.