
న్యూఢిల్లీ: కారు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాల పాలై 18 నెలల్లోనే కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ తన తప్పిదం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా మెంబర్స్ గురువారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఒక్కో ఆటగాడితో మాట్లాడిన మోదీ.. పంత్‌కు యాక్సిడెంట్ అయినప్పుడు అతని తల్లి సరోజ్‌కి ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో పంత్ కోలుకుంటాడని నమ్మకం వ్యక్తం చేసిన ఆమె ఒక దశలో తనకే ధైర్యం చెప్పిందని మోదీ తెలిపారు.
‘మీకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను మీ అమ్మగారికి ఫోన్‌కు చేసి మాట్లాడాను. తదుపరి చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అని డాక్టర్లను కూడా ఆరా తీశాను. ఆ టైమ్‌లో మీరు కచ్చితంగా కోలుకుంటారని మీ అమ్మ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడుతుంటే తను నాకే ధైర్యం చెబుతున్నట్టు అనిపించింది. అలాంటి తల్లి దీవెనలు పొందిన వ్యక్తి కచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాడని నాకు అప్పుడే అర్థమైంది. ఆ ప్రమాదం మీ తప్పే అని ఒప్పుకోవడం నాకు బాగా నచ్చింది. అంత పెద్ద ప్రమాదం తర్వాత కోలుకొని, తిరిగి మైదానంలోకి వచ్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం’ అని మోదీ అభిప్రాయపడ్డారు.
అది చహల్ ఐడియానా..
ఫైనల్లో కెప్టెన్ రోహిత్ వెరైటీగా నడుస్తూ ట్రోఫీ అందుకున్న తీరు ప్రధాని మోదీకి కూడా నచ్చింది. అలా చేయాలన్న ఐడియా స్పిన్నర్ చహల్దా? అని మోదీ ప్రశ్నించగా చహల్, కుల్దీప్ ఇద్దరిదని అని రోహిత్ బదులిచ్చాడు. ‘ఆ రోజు కోసం మేం ఎంతో కాలం ఎదురుచూశాం. దీంతో ఆ క్షణాలు ప్రత్యేకంగా ఉండాలని, కప్పు అందుకోవడానికి సాధారణంగా వెళ్లొద్దన్నారు. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ఆ ఇద్దరూ సూచించారు’ అని రోహిత్ వెల్లడించాడు.