మాదక ద్రవ్యాల వినియోగ వ్యసనం నుంచి బయటపడాలని, యువత ఆ దారి పట్టకుండా తమను తాము రక్షించుకోవాలి. కుటుంబ వ్యవస్థ ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవచ్చు. రోజుల తరబడి కుటుంబ సభ్యులు ఒకరినొకరు పలకరించుకోకపోయినా, కలుసుకోకపోయినా ఇబ్బందులు తప్పవు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి కుటుంబాలు దృఢంగా ఉండాలని ఈ మధ్య ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 5.6 శాతం మంది.. అంటే 185 మిలియన్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టు అంచనాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపాన వినియోగం కన్నా మాదక ద్రవ్యాల అలవాటు అత్యంత ప్రమాదకరం. నల్ల బజారులో దొరికే నల్లమందు, మార్ఫీన్, హెరాయిన్, ఛరస్, గంజాయి, మారిజువానా, కొకైన్ వంటివి మాదక ద్రవ్యాల కిందికే వస్తాయి. ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో సాంకేతిక నామాలతో చలామణీ అవుతూ ఉంటాయి. వీటిని అక్రమంగా రవాణా చేస్తూ కొందరు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉంటే, యువత వాటిని సరదా కోసం.. ఆ తర్వాత అలవాటు పడి, అనంతరం డ్రగ్స్ లేకుండా ఉండలేక చెడిపోతున్నారు. తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ ఒళ్లు గుల్ల చేసుకుని, మత్తులో పడి దేశ ద్రోహానికి సైతం వెనకాడటం లేదు. వీటికి బానిసలైన వారు వాస్తవాన్ని గ్రహించడం లేదు.
మాదక ద్రవ్యాల వెనుక రాజకీయాలు
‘Most of what you know about addiction is wrong’ అనే పుస్తకంలో పంజాబ్ కేంద్రంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం, వ్యాపారం, దాని చుట్టూ అల్లుకుని ఉన్న దేశ, విదేశ రాజకీయాలను ప్రస్తావించింది. ఒకే కుటుంబంలో తాగుడు, పొగాకు అలవాటు ఉన్న వారిని వ్యసనపరులుగా చూడకుండా అదే కుటుంబంలో హెరాయిన్ అలవాటుగా ఉన్న వ్యక్తిని మాత్రమే ప్రమాదకరంగా చూసే దృక్పథానికి మూల కారణాలను కూడా ఈ పుస్తకం చర్చించింది. కాగా, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారిలో ఎక్కువ మంది ఈశాన్య రాష్ట్రాల నుంచి, పంజాబ్‌లో ఉన్నట్టు తేలింది.
గంజాయిపై దర్యాప్తు
1893 ప్రాంతంలో మనదేశంలో గంజాయి సేవిస్తున్న వారి మీద, దాని దుష్ప్రభావాల మీదా సర్వే చేయించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ' రాయల్ ఒపీనియన్ కమిషన్' ను ఏర్పాటు చేసింది.1200 మంది కూలీలను, వైద్యులను, పకీరులను, మానసిక ఆరోగ్య సంస్థల అధినేతలను, పన్ను వసూలు చేసేవారినీ, సైనిక అధికారులనూ, స్మగ్లర్లను, సర్వే చేసి 3,281 పేజీల నివేదికను సమర్పించింది.
హైదరాబాద్ డ్రగ్స్ హబ్‌గా మారిందా?
ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోయాయి. చిన్న పిల్లలు కూడా వ్యసనపరులుగా మారారు. ప్రోక్సీ పేరిట సింథటిక్ నల్లమందు గొట్టాల రూపంలో వాడుకలోకి రావడమే కాకుండా వీధి చివర ఉండే కిళ్లీ బడ్డీల్లో చాక్లెట్ల రూపంలో లభ్యం అవుతున్నాయి. హైదరాబాద్ మహా నగరంలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. ఎంత నిఘా పెట్టినా నగరంలో ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే గచ్చిబౌలి లోని ఓ స్టార్ హోటల్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఒక హీరో ప్రియురాలి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన భాగ్యనగరంలోనే చోటు చేసుకుంది. రాజకీయ నాయకుల కుమారులు కొందరికి సైతం డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్టు, వాడకంలో కూడా వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పోలీసులు అందించిన సమాచారం మేరకు తెలుస్తోంది. చివరికి ఈ జాడ్యం కొన్ని అపార్టుమెంట్లకు చేరిందన్న విషయం ఆందోళన కలిగించే అంశమే. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మత్తు పదార్థాలు పట్టుపడటం పరిపాటిగా మారింది. పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితం అని ఒకప్పుడు అనుకున్న ఈ వ్యసనం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. రకరకాల రూపాల్లో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయి.
జీవితాలు ఛిద్రం
మత్తు పదార్ధాలకు అలవాటు పడిన సమాజం తిరోగమనంలో ప్రయాణిస్తుంది. 26 శాతం మంది మత్తు పదార్థాలు వాడనిదే చివరికి దైనందిన చర్యలు కూడా చేయలేక పోతున్నారని అనేక పరిశీలనల్లో వెల్లడైంది. మత్తు పదార్థాలు సేవించిన తర్వాత మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలై హుషారు, ఉత్తేజం వచ్చినట్టు అనిపిస్తుంది. చివరికి వాటికి ఆకర్షితులై బానిసలుగా మారిపోతారు. జీవితాలు ఛిద్రమవుతాయి.
ప్రభుత్వ చర్యలతోనూ మార్పులేదు
దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చి దిద్దడానికి, ఈ లక్ష్యంతోనే రూపొందించిన ‘నశా ముక్త భారత్ అభియాన్’ కోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ 2021 జూన్‌లో ఆవిష్కరించింది. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా ఏ రూపంలో ఉన్నా, వాటిని అరికట్టాలన్న సంకల్పాన్ని మరింత బలోపేతం చేయడానికి దేశం అన్ని రకాలుగా పోరాడుతోందని వక్తలు నొక్కి చెప్పారు.
అయితే పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఈ బెడద పెరుగుతూనే ఉంది. యువత జీవితాలు పెడదారి పడుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాలను అరికట్టడం ఒక్కటే మార్గం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నిజంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయా అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం లభించడం లేదు.
- జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్