అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్​ డబుల్​ పీహెచ్​డీ : మోదీ

అభివృద్ధిని అడ్డుకోవడంలో  కాంగ్రెస్​ డబుల్​ పీహెచ్​డీ : మోదీ

ముంబై: రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు పీహెచ్ డీ చేశాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్​ అయితే ఇందులో డబుల్​ పీహెచ్​డీ చేసిందని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్​ థాక్రే, అతడి కూటమి నేతలు అవినీతిలో ఆరితేరారని, రాష్ట్ర ప్రగతికి అవరోధంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్​ జిల్లా చిమూర్​లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని, ప్రసంగించారు. మహా వికాస్‌ అఘాడీ కూటమి మహారాష్ట్రకు హానికరమని పేర్కొన్నారు. చంద్రాపూర్ ప్రజలు రైల్​ కనెక్టివిటీ కావాలని ఏండ్లుగా కోరుతున్నారని, కానీ.. కాంగ్రెస్, అఘాడీ నేతలు అది జరగకుండా చేశారని తెలిపారు. 

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్​పవార్​) కూటమి అధికారంలో ఉండడం.. డబుల్​ ఇంజిన్​ సర్కారు కావడంతో అభివృద్ధి వేగంగా జరిగిందని చెప్పారు. ఈ డెవలప్​మెంట్​ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రెండున్నరేండ్లలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడాన్ని ప్రజలంతా చూశారని, అత్యధిక విదేశీ పెట్టుబడులు ఈ రాష్ట్రానికే వచ్చాయని వివరించారు. మహారాష్ట్ర గడ్డపై 12 వందే భారత్​ రైళ్లు నడుస్తున్నాయని, 100 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించామని చెప్పారు. కొత్త విమానాశ్రయాలు కూడా అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.  అలాగే, బీజేపీ మేనిఫెస్టో రాబోయే ఐదేండ్లలో మహారాష్ట్రకు వికాస్​ గ్యారంటీగా మారుతుందని చెప్పారు. 

ప్రజలంతా ఐక్యంగా ఉండాలి

తాము దేశాన్ని పాలించేందుకే పుట్టామని షాహీ పరివార్​ (కాంగ్రెస్​ రాజకుటుంబం) భావిస్తున్నదని, మానసికంగా అలా ఫిక్స్​ అయిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యానంతరం అణగారిన వర్గాల అభివృద్ధిని కాంగ్రెస్​ అడ్డుకున్నదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి ఏనాడూ కృషిచేయలేదని ఆరోపించారు. ఇప్పుడు కూడా ఆదివాసీల కమ్యూనిటీని విచ్ఛిన్నం చేయాలని ఆ పార్టీ కోరుకుంటున్నదని అన్నారు.  ‘‘మీ ఐక్యతను దెబ్బతీయాలని కాంగ్రెస్​ యత్నిస్తున్నది.  ఆ పార్టీ కుట్రను భగ్నం చేసేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.

ఎంవీఏలో సీఎం సీటు కోసం పోటీ

మహా వికాస్​ అఘాఢీ (ఎంవీఏ)లో డ్రైవర్​ (సీఎం)  సీటుకోసం అందరూ పోటీపడుతున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. షోలాపూర్​లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఆ కూటమిలో ఓ పార్టీ సీఎం అభ్యర్థులను నిర్ణయించడంలో బిజీగా ఉంటే.. ఆ నిర్ణయాన్ని తిరస్కరించడంలో కాంగ్రెస్​ బిజీగా ఉంటున్నదని అన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నవారితో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు. దేశాన్ని దశాబ్దాలపాటు కాంగ్రెస్​ పాలించినా.. ఇంకా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ఇదే వారి పని సంస్కృతి అని విమర్శించారు. 

కాంగ్రెస్​ పనితీరుతో మహారాష్ట్ర రైతులు ఎన్నో ఏండ్లుగా నష్టపోతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నీటిపారుదల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని తెలిపారు. కానీ, తమ సర్కారు ఈ సమస్యకు పరిష్కారం చూపించిందని, ఇందుకు షోలాపూర్​లో పెరుగుతున్న నీటిమట్టాలే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమితోనే సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమని తెలిపారు.