- 2036 ఎడిషన్ హక్కుల కోసంకృషి చేస్తున్నాం: మోదీ
- నేషనల్ గేమ్స్‌ను అధికారికంగా ప్రారంభించిన ప్రధాని
డెహ్రాడూన్: ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తే దేశ క్రీడా రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. 38వ ఎడిషన్ నేషనల్ గేమ్స్‌ను మోదీ మంగళవారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అన్ని రంగాలు లాభపడతాయని, అథ్లెట్లకు మెరుగైన సౌకర్యాలను సృష్టిస్తుందని చెప్పారు. ఆతిథ్య ఉత్తరాఖండ్ సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యాన్ని చాటిచెప్పే ప్రదర్శనలతో నేషనల్ గేమ్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. మార్చ్ ఫాస్ట్‌లో తెలంగాణ జట్టును ఆర్చర్ టి. చికిత, షూటర్ ధనుశ్ శ్రీకాంత్ ముందుండి నడిపించారు. ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పది వేల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.