డబ్ల్యూటీవో ఓకే అంటే ఆహారం సరఫరా చేస్తం

అహ్మదాబాద్: ప్రపంచానికి బువ్వ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బైడెన్​తో భేటీ సందర్భంగా చెప్పినట్టు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్​తో యుద్ధం వల్ల ప్రపంచంలోని చాలా దేశాల్లో తిండి గింజల స్టాక్స్​ పడిపోతున్నాయని, వరల్డ్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూటీవో) ఓకే అంటే ఆహారాన్ని సరఫరా చేస్తామని ఆయన అన్నారు. మంగళవారం గుజరాత్​లోని అదాలాజ్​లో శ్రీ అన్నపూర్ణ ధామ్​ ట్రస్ట్​ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్​ కాంప్లెక్స్​, హాస్టల్​ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి సమయంలో రెండేండ్లపాటు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్​ పంపిణీ చేయడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్​ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక చాలా దేశాలు తమ దగ్గరున్న ఫుడ్​ స్టాక్స్​, పెట్రోల్, డీజిల్​, ఎరువులను దాచుకుంటున్నాయని, దీంతో వాటి సరఫరాకు తలుపులు మూసుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రపంచం కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. హాని చేసే కెమికల్స్​ నుంచి నేలను కాపాడుకోవాలంటే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. సేంద్రియ సాగువైపు మళ్లితే రైతులకు మూడు నుంచి నాలుగేండ్లలో లాభాలు వస్తాయన్నారు. 

జనం బతుకుల్ని బాగుచేస్తున్నం

ప్రజల బతుకులను బాగు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తున్నామని, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన కింద ఇంటిని పొందడం ఓ వరమని సుధీర్​ కుమార్​ జైన్​ అనే వ్యక్తి రాసిన లెటర్​కు మోడీ బదులు రాశారు. సొంత ఇంటిని పొందినందుకు ఆనందంగా ఉందని, ఆ ఇల్లు వెలకట్టలేనిదని అన్నారు. ఇల్లంటే కేవలం ఇటుకలు, ఇసుక, సిమెంట్​ కలిపి కట్టేది మాత్రమే కాదని, మన కలలు, ఆశయాలను కలిపి నిర్మించుకునే కట్టడమని చెప్పారు. నాలుగు గోడలు కేవలం రక్షణనే ఇవ్వవని, మెరుగైన రేపటి కోసం నమ్మకాన్ని ఇస్తాయని అన్నారు.