టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం: మోదీ

టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం: మోదీ
  • టెర్రరిస్టులను, వాళ్ల వెనుక ఉన్నోళ్లనూ విడిచిపెట్టం
  • వాళ్లు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం: ప్రధాని మోదీ
  • పహల్గాం అటాక్‌తో యావత్ దేశం బాధ, కోపంతో రగిలిపోతున్నది
  • ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి  
  • పాక్‌లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలనూ నాశనం చేయాల్సిన టైమొచ్చిందని వ్యాఖ్య 

జమ్మూకాశ్మీర్‌‌లో పర్యాటకులపై దాడికి పాల్పడిన టెర్రరిస్టులను వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. వాళ్లు ఈ భూమ్మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు. ఆ టెర్రరిస్టుల వెనుక ఉన్నోళ్లను కూడా విడిచిపెట్టబోమని తేల్చి చెప్పారు. వాళ్లందరికీ కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బిహార్‌‌ లోని మధుబనీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.  జమ్మూకాశ్మీర్‌‌ పహల్గాం ఉగ్రదాడిలో మరణించినోళ్లకు నివాళులు అర్పించారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. టెర్రరిస్టులకు, వాళ్ల వెనుక ఉన్న పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను, ఆ దాడికి కుట్ర పన్నినోళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 


మోదీ తన ప్రసంగం మధ్యలో కొద్దిసేపు ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. ‘‘బిహార్ గడ్డ మీది నుంచి ప్రపంచం మొత్తానికీ చెబుతున్నాను.. మేం ఒక్క టెర్రరిస్టును కూడా వదిలిపెట్టం. వాళ్లు ఎక్కడ దాక్కున్నా గుర్తించి, పట్టుకుని, కఠినంగా శిక్షిస్తాం. ఆ టెర్రరిస్టుల వెనుక ఉన్నోళ్లను కూడా విడిచిపెట్టం. వాళ్లందరికీ కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇందుకు యావత్దేశం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదులకు స్వర్గధామమైన (పాక్) ప్రాంతంలో మిగిలిన ఉగ్ర శిబిరాలనూ నాశనం చేయాల్సిన సమయం వచ్చింది. ఉగ్రమూకల వెన్నెముకను విరిచేందుకు 140 కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉన్నారు” అని మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదం భారత స్ఫూర్తిని దెబ్బతీయలేదు. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు. మానవత్వాన్ని విశ్వసించే వాళ్లందరూ మాకు అండగా నిలిచారు. వాళ్లందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.  

పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి..  

పల్లెలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మధుబనీలో జరిగిన కార్యక్రమంలో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి బిహార్ అభివృద్ధి ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. ‘‘పల్లెలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదని మహాత్మాగాంధీ చెప్పారు. పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ ఏర్పాటుకు ఇదే కారణం. పల్లెలు వేగంగా అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక. రైతులు ఎంత బలంగా ఉంటే, పల్లెలు అంతగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు. 

దేశమంతా శోకసంద్రం.. 

పహల్గాం ఉగ్రదాడితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు బాధ, కోపం నెలకొన్నదని చెప్పారు. ‘‘బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉన్నది. గాయపడినోళ్లను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ దాడిలో ఒకరు కొడుకును, మరొకరు అన్ననో తమ్ముడినో, ఇంకొకరు భర్తను కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో బెంగాలీలు, కన్నడిగులు, మరాఠాలు, గుజరాతీలు, బిహారీలు ఉన్నారు. ఇది కేవలం అమాయక టూరిస్టులపై జరిగిన దాడి కాదు. భారతదేశ ఆత్మపై జరిగిన దాడి” అని అన్నారు.