జపాన్​ సాయంతో బుల్లెట్​ ట్రైన్​

జపాన్​ సాయంతో  బుల్లెట్​ ట్రైన్​

రూ.79 వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ

జపాన్ ప్రధాని షింజో అబేతో మోడీ భేటీ

ప్రధాని జీ–20 పర్యటన ప్రారంభం

నేడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో మీటింగ్

ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, జపాన్ సహకారంతో నిర్మిస్తున్న వారణాసి కన్వెన్షన్ సెంటర్‌‌తో సహా పలు కీలక అంశాలపై విస్తృత చర్చలతో ప్రధాని నరేంద్ర మోడీ తన జీ 20 పర్యటనను ప్రారంభించారు. ‘పాత స్నేహితుడు’ జపనీస్ ప్రధాని షింజో అబేతో గురువారం ఆయన భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్న మోడీ.. జపాన్​కు సహకారం అందించాలని కోరారు. దీనికి జపాన్ ప్రధాని అంగీకరించినట్లు మోడీ పేర్కొన్నారు. రూ. 79వేల కోట్లు సాయం అందించేందుకు జపాన్ రెడీ అయిందన్నారు.

ఆ దేశ సాయంతో 2022 నాటికి దేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీస్తుందని మోడీ అన్నారు. ప్రాజెక్టుకు సాయం అందించడంతో పాటు, ఆర్థిక నేరగాళ్లను అప్పగించేందుకు కూడా సహకరిస్తామని జపాన్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. 2015లో మోడీ, అబే కలిసి వారణాసిని సందర్శించినప్పుడు.. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇండియాలోని వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్‌‌కు జపాన్.. సుమారు రూ .200 కోట్లు ఇచ్చింది.

జీ 20 సమావేశాలకు గురువారం జపాన్ లోని ఒసాకా చేరుకున్న మోడీకి ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలతో పాటు కీలక అంశాలపైనా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిందని ఫారిన్ సెక్రటరీ విజయ్ గోఖలే తెలిపారు. అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా పారిపోయిన ఆర్థిక నేరస్థుల సమస్యపై మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జపాన్ పీఎం సూచించినట్లు తెలిపారు. శుక్రవారం జపాన్, అమెరికా అధ్యక్షులతో మోడీ భేటీ అవుతారని, ఇండో పసిఫిక్ వనరుల వినియోగంపై చర్చిస్తారని పేర్కొన్నారు.

ముంబై- ‑– అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని జపాన్​ ప్రధాని షింజో అబేను కోరాను. దీనికి ఆయన అంగీకరించారు. రూ.79 వేల కోట్లు సాయం అందించేందుకు జపాన్ రెడీ అయింది. జపాన్​ సాయంతో 2022 నాటికి దేశంలో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీస్తుంది. బుల్లెట్​ ట్రైన్​తో పాటు ఆర్థిక నేరగాళ్లను అప్పగించేందుకూ సహకరిస్తామని జపాన్ భరోసా ఇచ్చింది.

– ప్రధాని మోడీ