పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

న్యూఢిల్లీ: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను తొలగించడానికి ఇవాళ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని మోడీ నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తనకు చాలా నచ్చిన కార్యక్రమమని, కానీ కరోనా వల్ల విద్యార్థులను కలవలేకపోయానన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ స్టూడెంట్స్ ను కలుసుకోవడం హ్యాపీగా ఉందన్నారు. పరీక్షలంటే విద్యార్థుల కంటే వారి పేరెంట్స్ కు ఎక్కువ టెన్షన్ ఉంటుందన్నారు. పరీక్షలను పండుగల్లా చూడాలని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇచ్చారు. పరీక్షలనేవి జీవితంలో సహజ భాగమని.. ఎదుగుదల క్రమంలో ఎక్కాల్సిన మెట్లుగా భావించాలన్నారు. అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని సలహా ఇచ్చారు. 

ఆన్ లైన్ క్లాసుల గురించి కూడా మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ రీడింగ్ చేసేటప్పుడు చదువుతున్నారా లేదా రీల్స్ చూస్తున్నారనేది తమను తాము ప్రశ్నించుకోవాలని చమత్కరించారు. ‘ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనేది సమస్య కాదు. మాధ్యమం సమస్యే కాదు.. అసలు సమస్య మనసుతోనే. తరాన్ని బట్టి సాంకేతికంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడీ డిజిటల్ యుగంలో నేర్చుకోవడం చాలా సులువుగా మారింది. ఆన్ లైన్ ఎంతో అవసరం. దీని నుంచి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించొచ్చు. ఇలా నేర్చుకున్న జ్ఞానాన్ని దైనందిన జీవితంలో వినియోగించాలి’ అని మోడీ పేర్కొన్నారు. ఇక ఉప్పల్ లోని కేంద్రీయ విద్యాలయం–1లో ‘ పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని  వర్చువల్ గా నిర్వహించారు. ఇందులో సుమారు 3 వేల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు

మనసుకి హాయినిచ్చే ఎత్తిపోతల