రాజ్యాంగబద్ధంగానే పని చేసిన..ఎప్పుడూ పరిధి దాటలే: మోదీ

రాజ్యాంగబద్ధంగానే పని చేసిన..ఎప్పుడూ పరిధి దాటలే: మోదీ
  • నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లిన
  • జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.. టెర్రరిజానికి బదులిస్తం
  • భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన
  • సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని

న్యూఢిల్లీ:  రాజ్యాంగబద్ధంగానే తాను సేవ చేశానని.. ఎప్పుడూ పరిధి దాటి ప్రవర్తించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన ప్రభుత్వానికి రాజ్యాంగమే.. ‘‘గైడింగ్ లైట్’’ అని స్పష్టం చేశారు. ‘‘నా సేవలు రాజ్యాంగ పరిధికే పరిమితం చేశాను. అది నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లాను. నేషన్ ఫస్ట్ అనే భావన.. రాజ్యాంగాన్ని శతాబ్దాలపాటు సజీవంగా ఉంచుతుంది’’అని మోదీ తెలిపారు. రాజ్యాంగాన్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతున్నదన్న అపోజిషన్ పార్టీల విమర్శలపై ఆయన ఫైర్ అయ్యారు.

 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సీజేఐ జస్టిస్‌‌ సంజీవ్‌‌ ఖన్నా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిబల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియా ఆకాంక్షలు, కలలు కాలంతో పాటు కొత్త శిఖరాలకు చేరుకుంటాయన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో ప్రజల అవసరాలు మారుతూ ఉంటాయి. భవిష్యత్తులో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. వీటన్నింటి గురించి ఆలోచించి మన పెద్దలు రాజ్యాంగాన్ని రూపొందించారు. దీన్ని కేవలం చట్టాల పుస్తకంగానే వాళ్లు చూడలేదు. జీవనాధారం, నిరంతర ప్రవాహంగా మార్చారు”అని ప్రధాని మోదీ అన్నారు. 

రాజ్యాంగం..  ప్రజాస్వామ్య దీపిక

రాజ్యాంగమే తమకు మార్గదర్శి అని మోదీ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లయింది. రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచింది. అది కేవలం పత్రం కాదు.. ప్రజాస్వామ్య దీపిక. రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా. దేశంలో అన్ని చోట్లా రాజ్యాంగమే అమలు అవుతున్నది. జమ్మూ–కాశ్మీర్‌‌‌‌లో ఇప్పుడు రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ టెర్రరిజానికి దీటుగా బదులిస్తాం. ముంబై మారణ హోమం దుర్ఘటన 26/11 రోజే జరిగింది. ఆ విషాద ఘటనలో మృతిచెందిన వారికి నివాళులర్పిస్తున్నా’’అని మోదీ తెలిపారు.

ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగమే బలం 

రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌లో రాజ్యాంగ సభ ఆమోదించింది. రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. దీనిని స్వీకరించిన రోజును ‘సంవిధాన్ దివస్‌‌’గా పాటిస్తారు. పటిష్ట భారత్‌‌ నిర్మాణానికి కృషి చేస్తామని దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలి’’అని ఆయన పిలుపునిచ్చారు. 

రాష్ట్రపతిని రాహుల్ అవమానించారు: బీజేపీ

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ముర్మును ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. జాతీయ గీతం పాడుతున్న టైమ్​లో ఆయన ఏదో ఆలోచిస్తూ ఉన్నారని, ఆ తర్వాత వేదికపై ఉన్నవాళ్లు రాష్ట్రపతిని విష్ చేస్తే.. రాహుల్ మాత్రం కిందికి దిగిపోయారని బీజేపీ నేత అమిత్ మాలవీయా మండిపడ్డారు. ‘‘జాతీయ గీతం ప్లే అవుతున్న టైమ్​లో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్‌‌ పక్కకు, కిందకు చూస్తున్నడు. రాష్ట్రపతి, ఇతర నేతలు నిలబడి ఉండగానే రాహుల్ కూర్చోవడానికి ప్రయత్నించారు. 50 సెకన్లు తన ఫోకస్ స్టడీగా పెట్టుకోలేకపోయారు. ద్రౌపది ముర్మును ఆయన ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. గాంధీ కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీలపై ప్రేమలేదు’’ అని విమర్శించారు.