ప్రపంచ శాంతికే ప్రాధాన్యం:ప్రధాని మోదీ

ప్రపంచ శాంతికే ప్రాధాన్యం:ప్రధాని మోదీ
  • క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు: మోదీ 
  • స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసమే ఈ కూటమి
  • చైనాకు పరోక్షంగా ప్రధాని కౌంటర్ 
  • క్వాడ్ దేశాల సదస్సులో ప్రసంగం 

వాషింగ్టన్: భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకంకాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్టబద్ధమైన రూల్స్ ఆధారంగా అంతర్జాతీయ శాంతికి మద్దతు తెలపడం, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అన్ని సమస్యలకూ శాంతియుత పరిష్కారాలను సాధించడం కోసమే క్వాడ్ కూటమి పని చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ను స్వేచ్ఛాయుత, బహిరంగ, సమగ్ర, సుసంపన్నమైన ప్రాంతంగా మార్చడమే తమ ప్రాధాన్య అంశమని ప్రకటించారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో తరచూ ఉద్రిక్తతలకు తెరలేపుతున్న చైనాకు ఆయన ఈ మేరకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. 

‘‘మా సందేశం స్పష్టంగా ఉంది. పరస్పర సహకారం, భాగస్వామ్యం కోసం క్వాడ్ కూటమి కొనసాగుతుంది” అని తేల్చిచెప్పారు. శనివారం అమెరికాలోని డెలావెర్ రాష్ట్రం  విల్మింగ్టన్ లో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో జరిగిన క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) సదస్సులో మోదీ, బైడెన్ తోపాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. క్వాడ్ దేశాలు ఆరోగ్య భద్రత, టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ వంటి రంగాల్లో కలిసికట్టుగా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్న ప్రస్తుత సమయంలో మానవ జాతి మనుగడకు కీలకమైన ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు క్వాడ్ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందన్నారు. 

ఆ దేశాలకు 4 కోట్ల డోసుల వ్యాక్సిన్  

గర్భాశయ క్యాన్సర్ పై పోరాటం కోసం భారత్ తరఫున ఇండో పసిఫిక్ దేశాలకు రూ. 62 కోట్ల (7.5 మిలియన్ డాలర్లు) గ్రాంటును ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే ఆయా దేశాలకు 4 కోట్ల డోసుల ‘హ్యూమన్ పాపిలోమావైరస్ (హెచ్ పీవీ) వ్యాక్సిన్ కూడా అందజేస్తామని వెల్లడించారు. విల్మింగ్టన్ లో క్వాడ్ సదస్సు సందర్భంగా జరిగిన ‘క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ అన్నదే భారత్ విజన్ అని ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఇతర దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే, ఇండో పసిఫిక్ దేశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు రూ. 4.17 కోట్ల స్కాలర్ షిప్ లు అందజేయనున్నట్టు క్వాడ్ సదస్సు సందర్భంగా భారత్ ప్రకటించింది. భారత్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు ఈ స్కీం వర్తిస్తుందని తెలిపింది.  

బైడెన్, మోదీ ద్వైపాక్షిక చర్చలు 

భారత్, అమెరికా బంధం గతంలో ఎన్నడూ లేనంతగా బలపడిందని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. క్వాడ్ సదస్సు సందర్భంగా శనివారం డెలావెర్ లోని బైడెన్ నివాసంలో ఆయనతో మోదీ భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్ తో సహా ప్రపంచవ్యాప్తంగా తాజా పరిణామాలపై, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు ఈ సందర్భంగా చర్చించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వానికి బైడెన్ మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించి శాంతి స్థాపనకు చేసిన కృషిని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకారంపైనా చర్చలు జరిపారు. అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్ నుంచి 31 ఎంక్యూ 9 బీ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకోవడం పట్ల బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఎంక్యూ 9 బీ డ్రోన్లను హంటర్ కిల్లర్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. వీటిలో 16 స్కై గార్డియన్, 15 సీ గార్డియన్ డ్రోన్లు భారత్​కు అందనున్నాయి. 

బైడెన్​కు మోదీ సిల్వర్ ట్రైన్ గిఫ్ట్ 

అమెరికా పర్యటన సందర్భంగా ప్రెసిడెంట్ బైడెన్ కు ప్రధాని మోదీ సిల్వర్ ట్రైన్​ బొమ్మను గిఫ్ట్​గా అందజేశారు. భారతీయ లోహ కళాకారుల ప్రతిభను చాటేలా మహారాష్ట్రకు చెందిన కళాకారులు అందంగా తయారు చేసిన ఈ వెండి ట్రైన్ మోడల్ పై ‘ఇండియన్ రైల్వేస్’, ‘ఢిల్లీ–డెలావర్’ అని రాశారు. అలాగే స్టీమ్ ఇంజన్లకాలం నాటి మోడల్ గా రూపొందించడం ద్వారా దీనికి చరిత్రాత్మక అంశాన్ని కూడా జోడించారు. దీనితోపాటు బైడెన్ దంపతులకు మోదీ జమ్మూకాశ్మీర్​కు చెందిన ప్రఖ్యాత పష్మినా శాలువాను కూడా బహూకరించారు. 

భారత్​కు తిరిగిరానున్న 297 కళాఖండాలు 

భారత్ నుంచి స్మగ్లింగ్, దొంగతనాలు, ఇతర మార్గాల ద్వారా అమెరికాకు చేరిన విలువైన పురాతన కళాఖండాలు తిరిగి రానున్నాయి. మొత్తం 297 కళాఖండాలను భారత్ కు తిరిగి ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం అంగీకరించారు. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బైడెన్ కు, యూఎస్ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే, కల్చరల్ ప్రాపర్టీ అక్రమ రవాణా నివారణకు అమెరికా, భారత్ గత జులైలో ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత కళాఖండాలను తిరిగి అప్పగించ నున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.