- ఇందూరు జనగర్జన’ సభలో ప్రధాని మోదీ
- కేటీఆర్‌ను సీఎం చేస్తానని కేసీఆర్ నన్ను కలిసిండు
- ఇదేమన్న రాజరికమా..? మీరేమన్నా రాజులా అని తిరస్కరించిన
- ఎన్డీయేలో చేరతానంటే వద్దన్నా.. అప్పటినుంచి నాకండ్లలోకి చూస్తలేడు
- ఇక్కడ జనం సొమ్ము లూటీ చేసి కర్నాటకలో కాంగ్రెస్ కోసం ఖర్చు పెట్టిండు
- ఆ రుణం తీర్చుకునేందుకు ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది
- త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసింది
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని హెచ్చరిక
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అధికారం ఇస్తే.. కేసీఆర్ అవినీతిని కక్కిస్తానని, ఆ అవినీతి సొమ్మును తెచ్చి ప్రజల కాళ్ల దగ్గర పెడ్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందుకు తాను గ్యారంటీ అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరి పోరాటంతో, ఎందరో అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అలాంటి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసిందని, ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ తన వెంటపడ్డారని, కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో తన కండ్లలోకి చూడాలంటేనే జంకుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధుల్లోనూ కేసీఆర్ సర్కార్ దోపిడీ చేస్తున్నదని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు తరిమేస్తారని, డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మంగళవారం నిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. గిరిరాజ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ‘ఇందూరు జనగర్జన’ బహిరంగ సభలో ప్రసంగించారు. రూ. 8 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్, రైల్వే, హెల్త్ ప్రాజెక్టులకు మొదట ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు వందకు వందశాతం నిజాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చానని ప్రధాని అన్నారు.
ఇక్కడ లూటీ చేసి కర్నాటకలో ఖర్చు చేసిండు
తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలందరూ అలుపెరుగని పోరాటం చేశారు. ఎంతో మంది యువతీయువకులు ప్రాణాలు అర్పించారు.. వారి త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసింది. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు.. ఇట్లా కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నది” అని మోదీ మండిపడ్డారు. రైతులకు, యువతకు మాయమాటలు చెప్పి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా బీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీమ్‌గా మారింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది.. తెలంగాణలో దోచుకున్న డబ్బును కర్నాటకలో కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ ఖర్చు చేసింది. ఇప్పుడు తెలంగాణలో ఆ రుణాన్ని తీర్చుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. తెలంగాణలో ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ కాంగ్రెస్ ద్వారా గిమ్మిక్కులు చేస్తున్నడు. కిలాడీల పార్టీ కాంగ్రెస్‌ను నమ్మొద్దు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టం.. అందుకే ఆ రెండు పార్టీలు పరస్పర ఒప్పందంతో పనిచేస్తున్నాయి” అని మోదీ దుయ్యబట్టారు.
ఆరోజు నుంచి కేసీఆర్ తీరు మారింది
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నుంచి కేసీఆర్ తీరు మొత్తం మారిపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ ఎన్నికలకు ముందు తాను ప్రధానమంత్రిగా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా సీఎం హోదాలో దగ్గరుండి స్వాగతం పలికే కేసీఆర్.. ఆ తర్వాత నుంచి తన కండ్లలోకి చూడాలన్నా భయపడుతున్నారని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలువడంతో మేయర్ ఎన్నికలో మద్దతివ్వాలని, ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, ఎక్కడా లేని ప్రేమను ఒలకబోశారని, అందుకు తాను ఒప్పుకోలేదని ప్రధాని స్పష్టం చేశారు. ఓటేసిన ప్రజలకు ద్రోహం చేయబోమని, వారి కోసం తమ నాయకులు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారని, ప్రతిపక్షంలోనే కూర్చుంటాం కానీ బీఆర్ఎస్కు మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పానన్నారు. మరోసారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నట్లు చెప్పారని, దీనికి తన ఆశీర్వాదం కావాలన్నారని ఆయన వివరించారు. ‘కేసీఆర్.. ఇదేమైనా రాజరికమా?’ అని గట్టగా చెప్పేసరికి అప్పటి నుంచి తనను కలువాలంటేనే వణికిపోతున్నారని పేర్కొన్నారు. తాము బీఆర్ఎస్తో ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదని, రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్తారని అన్నారు.
దేశం, ప్రజలు కాంగ్రెస్ అక్కర్లేదు
కాంగ్రెస్ పార్టీకి దేశం, దేశ ప్రజలు అక్కర్లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఇండియా’ కూటమికి దేశాభివృద్ధిపై ధ్యాసలేదని విమర్శించారు. ఎన్నికల టైంలో ప్రజలకు ఆశలు చూపించి ఐదేండ్లు అధికారాన్ని పొందాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత జేబులు నింపుకోవడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పని అని ఆరోపించారు. రజాకర్ల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు గుజరాత్ బిడ్డ సర్దార్‌వల్లభాయ్‌పటేల్ పోరాటం చేశారని, ఆస్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ సమూల మార్పుల కోసం గుజరాత్ బిడ్డగా తాను వచ్చానని మోదీ తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తనది గ్యారంటీ అని, ఒక్కసారి రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు.
మహిళా బిల్లును 30 ఏండ్లు తొక్కిపెట్టారు
‘‘మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి దేశానికి నారీశక్తిని నిరూపించాం. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును 30 ఏండ్లు తొక్కిపెట్టింది. చిత్తశుద్దితో మేము చొరవ తీసుకుని పాస్ చేయించాం” అని ప్రధాని మోదీ అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు మొదలుపెట్టిందని, దేశానికి అతి పెద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీనేనని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నదని, లోక్ సభ స్థానాలు తగ్గిస్తున్నట్లు అబద్ధపు ప్రచారానికి తెరలేపుతున్నదని అన్నారు. తమిళనాడులో మందిరాల ఆస్తులు, సంపద కబ్జాకు గురవుతున్నాయని, వాటిని విడిపించి దమ్ము నిరూపించుకోవాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నం
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉన్నం. రాష్ట్రంలో రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ యువతకు ఎంతో టాలెంట్ ఉంది. అన్ని రైళ్ల విద్యుదీకరణ పనులు వీలైనంత వేగంగా పూర్తి చేయిస్తం. బీబీనగర్ ఎయిమ్స్‌ను డెవలప్ చేస్తం. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 20 క్రిటికల్ కేర్ సెంటర్స్‌ను ఆధునీకరిస్తాం” అని ప్రధాని పేర్కొన్నారు. సభకు అనేక మంది ఆడబిడ్డలు వచ్చారని, వారందరి ఆశీస్సులు తనకు దక్కడం ఏనాటికీ మరిచిపోలేనిదని ఆయన అన్నారు. ‘నా కుటుంబసభ్యుల్లారా’ అంటూ తన ప్రసంగంలో తెలుగులో మాట్లాడి జోష్ నింపారు. సభలో ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, బాపూరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్‌రెడ్డి, సెక్రటరి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వాలక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు గవర్నర్ తమిళిసై కూడా హాజరయ్యారు.
మోదీకి పసుపు కొమ్ములతో ప్రత్యేక దండ
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం పాలమూరు వేదికగా ప్రధాని మోదీ ప్రకటించడంతో మంగళవారం నిజామాబాద్‌లో ఆయన సభకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పసుపు రైతులు వేలాదిగా తరలివచ్చారు. ఆర్మూర్ నుంచి పచ్చని పసుపు మొక్కలతో పాదయాత్రగా తరలివచ్చిన రైతులు వాటిని ప్రధాని మోదీ చేతికి అందించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. పూలు, పసుపు కొమ్ములతో తయారుచేసిన ప్రత్యేక దండను ఎంపీ అర్వింద్‌తో కలిసి ప్రధాని మోదీ మెడలో వేసి ధన్యవాదాలు తెలిపారు.
పసుపుతో ప్రపంచాన్ని కాపాడిన తెలంగాణ రైతులు
పసుపు పవిత్ర ప్రసాదమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కరోనా బారి నుంచి తెలంగాణ పసుపు ప్రపంచాన్ని కాపాడింది. ఇక్కడి పసుపు రైతులు.. ముఖ్యంగా మహిళా రైతులు ప్రపంచాన్ని ఆదుకున్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడి పసుపు రైతుల కష్టాలను గుర్తించి తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నం. ఎగుమతులు పెంచి రైతులు లాభపడేలా చేస్తం” అని తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్ మొదటి యూనిట్ ప్రాజెక్టు పనులు తానే స్టార్ట్ చేశానని, ఇప్పుడు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రెండో విద్యుత్ ప్లాంటును త్వరలో ప్రారంభిస్తామని, వీటితో ఎక్కువ లాభం జరిగేది తెలంగాణకేనని చెప్పారు.
ఎన్డీయేలో చేరుతానంటే.. నో అన్న
‘‘ఇంతకు ముందెన్నడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ మీకు చెప్తున్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నేను ప్రధానమంత్రిగా తెలంగాణకు వచ్చినప్పుడల్లా స్వాగతం పలికే కేసీఆర్ ఆ తర్వాత నుంచి ఎందుకు నా కండ్లలోకి చూడటం లేదో మీకూ తెలియాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు సాధించింది. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ఓ రోజు కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నన్ను కలిసిండు. గజమాల, శాలువాతో సత్కరించిండు. నాపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసిండు. తన క్యారెక్టర్లోనే లేనంత ప్రేమ చూపెట్టిండు. కేసీఆర్ తీరు చూసి ఆశ్చర్యమేసింది? ఏందని ఆరా తీస్తే.. ‘మీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది’ అంటూ కేసీఆర్ పొగడటం మొదలుపెట్టిండు. ‘ఎన్డీయేలోకి మమ్మల్ని చేర్చుకోండి. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో మాకు మద్దతివ్వండి’ అంటూ వెంటపడ్డడు. ప్రతిపక్షంలోనైనా కూర్చోవడానికి సిద్ధమే.. కానీ, మీతో కలిసే ప్రసక్తేలేదని కేసీఆర్‌కు తేల్చిచెప్పిన. నమ్మి మాకు ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయబోమని స్పష్టం చేసిన. బీఆర్ఎస్కు మద్దతివ్వడానికి ఒప్పుకోలేదు. ఎన్డీయేలోకి ఎంట్రీకి నో చెప్పిన. దీంతో కేసీఆర్ దిమాక్ ఖరాబైంది.’’
- ప్రధాని నరేంద్ర మోదీ
కొడుకును సీఎం చేయడానికి ఇది రాజరికమా?
మేము అవినీతిపై ప్రశ్నించినప్పుడు మళ్లోసారి కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు. ‘మోదీజీ నేను రాష్ట్రంలో మస్తు పనులు చేసిన.. ఇగ పాలనా పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించాలనుకుంటున్న. ఒక్కసారి మీ దగ్గరకు కేటీఆర్‌ను పంపుత. తనను మీరు ఆశీర్వదించండి’ అని కేసీఆర్ అన్నడు. అందుకు నేను..‘కేసీఆర్.. ఇది ప్రజాస్వామ్యం. కొడుక్కు పాలనా పగ్గాలు అప్పగించడానికి మీరెవరు? ఇదేమన్నా రాజరికమా? మీరేమన్నా రాజులా, మహారాజులా..?! ఎవరికి అధికారం అప్పగించాల్నో.. ఎవర్ని దించేయాల్నో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తరు’ అని గట్టిగా చెప్పిన. అంతే.. అప్పటి నుంచి కేసీఆర్ పత్తా లేడు. నన్ను కలవాలంటే భయపడుతున్నడు. నా కండ్లలోకి చూడాలన్నా.. నా నీడను తాకాలన్నా .. వణికిపోతున్నడు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానిగా నేను వస్తే.. నా ముందుకు రావడానికి సాహసించడం లేదు. అవినీతిపరులు నా దగ్గర కూర్చోవాలంటే వణికిపోతరు. అందుకే కేసీఆర్ పారిపోతున్నడు. ఇదీ ఆయన పురాణం.
- ప్రధాని నరేంద్ర మోదీ
మోదీ ప్రధాని అయ్యాకకరెంట్ కోతల్లేవ్
మోదీ ప్రధాని అయ్యాక కరెంట్ కోతలు లేవు. పరిశ్రమలకు పవర్ హాలీడేలు లేవు. 2014కు ముందు దేశంలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ ఉండేవి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామిక రంగానికి మోదీ అంకితం చేశారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొన్నది. 140 కోట్ల మంది దేశ ప్రజలకు మోదీ సర్కార్ రెండు డోసుల టీకాను ఉచితంగా ఇచ్చింది. హైదరాబాద్‌లో సొంతంగా వ్యాక్సిన్ తయారుచేసుకున్నాం. 84 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు డిమాండ్‌ను ప్రధాని మోదీ సాకారం చేశారు.
- కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మోదీ రుణం తీర్చుకునే సమయమిది
పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని మోదీ రుణం తీర్చుకునే టైంవచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించి గిఫ్టుగా ఇద్దాం. ఏడుగురిని గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబానికి సినిమా చూపిస్త. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ప్రకటించలే అని మంత్రి కేటీఆర్ ట్విటర్లో అడిగిండు. వాళ్లు గొప్పగా చెప్పుకునే ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) కేంద్రానికి ఇప్పటికీ ఇవ్వకుండా జాతీయ హోదా ఎలా కోరుతరు. డీపీఆర్ ఇవ్వక కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు బురదజల్లే ప్రొగ్రామ్ పెట్టిండ్రు.
ఎంపీ ధర్మపురి అర్వింద్
కేసీఆర్ ఇచ్చినహామీలు నెరవేరవు
సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను ఎప్పటికీ పూర్తి చేయరు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నరు. ఐదేండ్ల నుంచి రైతుల రుణమాఫీ పూర్తిగా కాలే. కేసీఆర్ ఈసారి ఎన్నికలకు కొత్త కథతో వస్తడు నమ్మొద్దు. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్‌తో నిర్మించిన రైతు వేదికలు, శ్మశాన వాటికలకు, గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులకు కేసీఆర్ తన పేరు ప్రచారం చేసుకుంటుండు. గిరిజన యూనివర్సిటీని ప్రధాని మోదీ ప్రకటించినందున భూమి ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి చాటుకోవాలి.
- డీకే అరుణ
పసుపు బోర్డు అవసరం గుర్తించింది మోదీనే
పసుపు రైతుల కలను సాకారం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కింది. 370 ఆర్టికల్ రద్దు, రామమందిరం నిర్మాణం నిర్ణయం ప్రజలను ఎలా అయితే సంతోష పెట్టాయో తెలంగాణ పసుపు బోర్డు అంతే. కేసీఆర్‌ను రాజకీయంగా సమాధికట్టే సంకల్పం ప్రజలు తీసుకోవాలి. స్టేట్‌లో బీజేపీ ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుంది.
- మురళీధర్‌రావు