న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్లు పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న నేపథ్యంలో అఫ్గాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రస్తుతం భారత్ ఎటువంటి అడుగులు వేయాలి? మన ప్రాధాన్యతలపై ఎటువంటి నిర్ణయానికి రావాలి? అనే అంశాలపై అత్యవసరంగా హైలెవల్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా మరికొందరు సీనియర్ అధికారులను ఇందులో నియమించారు. అమెరికా బలగాలు నిన్న రాత్రి పూర్తిగా వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ గ్రూప్ ప్రస్తుతం ఇంకా అఫ్గాన్‌లో ఉండిపోయిన భారతీయుల సేఫ్టీ, వారిని స్వదేశానికి తరలించడం లాంటి అంశాలనే అత్యంత ప్రాధాన్యతతో ఎలా చేపట్టాలన్న దానిపై వ్యూహం సిద్ధం చేయనుంది.
ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఈ హైలెవెల్ ప్యానెల్ రెగ్యులర్‌గా సమావేశమవుతూ భారతీయులను సేఫ్‌గా స్వస్థలాలకు చేర్చడంతో పాటు భారత్ వ్యతిరేక టెర్రరిజానికి అఫ్గాన్ హబ్‌గా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తోందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో కాబూల్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయ సమాజం అఫ్గాన్‌లో పరిస్థితులపై ఎలా రియాక్ట్ అవుతోందన్న విషయానలు కూడా గమనిస్తోంది. అంతేకాదు అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితుల్లో టెర్రరిస్టులకు సేఫ్ హెవెన్‌గా మారకూడదంటూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలిలో ఈ రోజు (మంగళవారం) చేసిన తీర్మానం వెనుక కూడా భారత ప్రభుత్వం నెరిపిన దౌత్యం ఉందని సమాచారం. మరోవైపు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుండడం ఇక్కడ కలిసొచ్చిన అంశం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్ దేశాలు కలిసి తీర్మానం ముసాయిదాను రూపొందించిన భద్రతా మండలిలో ప్రతిపాదించాయి. దీనికి 13 దేశాలు ఆమోదం తెలుపగా, రష్యా, చైనా మాత్రం ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయాయి. అఫ్గాన్‌లో ఉగ్రవాద కార్యకపాలాలు జరగకుండా చూడడంతో పాటు ఆ దేశంలో ఉన్న విదేశీయులు వెళ్లేందుకు ఇబ్బందులు కలిగించకుండా చూడడం, దేశంలోని మైనారిటీల హక్కులను కాపాడడం లాంటి డిమాండ్స్‌తో ఆ తీర్మానం చేశారు.