వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోంది: ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. దేశం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లొద్దన్నారు. మే 8వ తేదీ బుధవారం వరంగల్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఈ నగరాన్ని కాపాడాలన్నారు. వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోందని చెప్పారు.

 నాలుగో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లు చూడాలంటే భూతద్దం సరిపోదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇండియా కూటమితో ఏడాదికో ప్రధాని మారుతారని చెప్పారు.ఏడాదికో ప్రదాని ఉంటే.. దేశం బాగుపడుతుందా? అని ప్రశ్నించారు.  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. దేశం ఆగం అవుతుందన్నారు.  కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉంటాయన్నారు.  కుంభకోణాలు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ అని విమర్శించారు.

రుణమాఫీ చేస్తామని చెప్పి.. దాన్ని పంద్రాగస్టుకు తీసుకెళ్లారని.. దేవుడిపై ఓట్లు వేస్తున్నారని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. తెలగాణ కోసం బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందా?,  ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 జమ చేసిందా? అని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలకు ఇస్తామన్న 250 గజాల జాగ ఏమందని ప్రధాని నిలదీశారు. రాష్ట్రంలో పవన్ కట్స్, నీళ్ల కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు మోదీ. కాంగ్రెస్ తీరుతో ఓబీసీలకు నష్టం జరుగుతుందన్నారు. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు. మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం  చేశారు.  రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడున్న ఒక ఆర్.. ట్యాక్స్ వసూలు చేసి, ఢిల్లీలో ఉన్న మరో ఆర్ కు కప్పం కపడుతోందని ప్రధాని మోదీ అన్నారు.