వక్ఫ్​ చట్టంతో లాభపడింది భూ మాఫియానే : మోదీ

వక్ఫ్​ చట్టంతో లాభపడింది భూ మాఫియానే   : మోదీ
  • ఆ​పేరుతో లక్షల హెక్టార్ల భూమిని దక్కించుకున్నరు: మోదీ

హిసార్ (హర్యానా): వక్ఫ్​ రూల్స్​ను కాంగ్రెస్​ తన స్వార్థానికి వాడుకున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు.  ముస్లిం ఛాందసవాదులను మాత్రమే కాంగ్రెస్​ సంతృప్తి పరిచిందని, వక్ఫ్​ సవరణ చట్టం పట్ల  వ్యతిరేకతే దీనిని రుజువు చేస్తున్నదని అన్నారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఆ వర్గానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. అలాగే, లోక్​సభ ఎన్నికల్లో ముస్లింలకు 50 శాతం సీట్లను కాంగ్రెస్​ ఇచ్చి ఉంటే.. వారి హక్కుల కోసం వారే చట్టసభల్లో కొట్లాడేవారు కదా? అని అడిగారు. 

సోమవారం హర్యానాలోని హిసార్​ఎయిర్​పోర్ట్​ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. వక్ఫ్​ చట్టంతో లాభపడింది భూ మాఫియానేనని చెప్పారు. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో దక్కించుకున్నారని, వీటితో పేద ముస్లింలు ఏనాడూ ప్రయోజనం పొందలేదని  తెలిపారు.  వక్ఫ్​ ఆస్తులను నిజాయతీగా ఉపయోగించినట్లయితే ముస్లిం యువకులు సైకిల్​ పంక్చర్లు వేస్తూ ఉపాధి పొందాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. కొత్త చట్టంతో ఈ దోపిడీ ఆగిపోతుందని, సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేదని అన్నారు.

ఇదే నిజమైన సామాజిక న్యాయమని, దీంతో పేద ముస్లింలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని మోదీ పేర్కొన్నారు.  కాగా, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో హిసార్​ ఎయిర్​పోర్ట్​ ఓ మైలురాయి అవుతుందని చెప్పారు. డాక్టర్​ బీఆర్​అంబేద్కర్​ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్​ పోరాటం తమ పార్టీకి స్ఫూర్తిని ఇచ్చిందని, తాము తీసుకున్న ప్రతి నిర్ణయం, పాలసీ ఆయనకు 
అంకితం అని పేర్కొన్నారు. 

రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు

అధికారం కోసం రాజ్యాంగాన్ని ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్) ఆయుధంలా వాడుకుంటున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కాంగ్రెస్​ఆయనను  అవమానించిందని, ఎన్నికల్లో ఓడిపోయేలా చేసిందని, ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించిందని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం ఇవ్వాలని కలలు కన్నారని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌‌ను వ్యాప్తి చేసి, అంబేద్కర్‌‌  దార్శనికతకు అడ్డుకట్ట వేసిందని మండిపడ్డారు.

ఉత్తరాఖండ్​లో యూనిఫామ్​ సివిల్​ కోడ్​ అమలవుతుంటే.. దురదృష్టవశాత్తు కాంగ్రెస్​ దాన్ని వ్యతిరేకిస్తున్నదని అన్నారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ విలువల గురించి మాట్లాడుతారే తప్ప.. వాటిని ఎప్పుడూ  పాటించరని మోదీ ఎద్దేవా చేశారు.