అడవులపైకి బుల్డోజర్లు.. తెలంగాణలో ప్రకృతి విధ్వంసం: ప్రధాని మోదీ

అడవులపైకి బుల్డోజర్లు..  తెలంగాణలో ప్రకృతి విధ్వంసం: ప్రధాని మోదీ
  • హామీలను కాంగ్రెస్​ విస్మరించింది 
  • మేం పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే.. కాంగ్రెస్​ నాశనం చేస్తున్నది
  • అవినీతిలో కర్నాటక నంబర్​ వన్ 
  • వక్ఫ్ రూల్స్​ను కాంగ్రెస్​ స్వార్థానికి వాడుకున్నది.. ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలే?
  • అంబేద్కర్​ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్సేనని కామెంట్ 
  • హర్యానాలో ప్రధాని మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్​లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అడవులపై బుల్డోజర్లను ప్రయోగించడంలో నిమగ్నమైందని విమర్శించారు.  ప్రకృతిని నాశనం చేయడంతోపాటు జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తున్నదని అన్నారు.   ఇది కాంగ్రెస్ పార్టీ అసలైన పనితీరు అని ఎద్దేవా చేశారు.  

హర్యానాలో తాము పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటే.. తెలంగాణ లోని కాంగ్రెస్ సర్కారు అడవిని నాశనం చేస్తున్నదని మోదీ అన్నారు. సోమవారం హర్యానాలోని హిసార్ ఎయిర్ పోర్ట్, ఇతర ప్రాజెక్ట్ లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం  యమునా నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో   ప్రసంగించారు. హర్యానాలో తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 

కుర్చీ కోసం కాంగ్రెస్​ ఆరాటం

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయని మోదీ అన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం అటకెక్కింది. కర్నాటకలో కరెంట్ నుంచి పాల దాకా.. బస్సు చార్జీల నుంచి విత్తనాలకు వరకు..  రేట్లు భారీగా పెరిగాయి. కర్నాటకలో పెరుగుతున్న నిత్యావసర ధరలను వివరించేలా ‘ఏ నుంచి జెడ్’ అక్షరాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

ఏకంగా కాంగ్రెస్ సీఎం.. అవినీతిలో కర్నాటకను దేశంలోనే  నంబర్ వన్ గా నిలిపారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మరించింది. అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్నది. ఈ విధానంతో ప్రకృతి నాశనం అవుతున్నది. జంతువులు ప్రమాదంలో పడుతున్నాయి’’ అని కామెంట్ చేశారు. ఇలా రెండు రకాల ప్రభుత్వాల మోడల్స్ ప్రజల ముందు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ మోడల్ లో కేవలం అబద్ధాలు మాత్రమే నిరూపితమయ్యాయని పేర్కొన్నారు.  సత్యం ఆధారంగా పాలన అనేది బీజేపీ మోడల్​ అని చెప్పారు. వాళ్లది కుర్చీ కోసం ఆరాటం అయితే..తమది వికసిత్​ భారత్ కల సాకారం చేసే పోరాటం అని తెలిపారు. 

అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నం

డాక్టర్​ బీఆర్​అంబేద్కర్​ చూపిన మార్గంలో తాము  పాలన సాగిస్తున్నట్టు మోదీ చెప్పారు.  రాజ్యాంగ గౌరవాన్ని పెంపొందించేలా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు.  కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని, తమ ప్రభుత్వం 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి, అణగారిన వారికి ఉపశమనం కల్పించిందని చెప్పారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్​ ఇచ్చామని వెల్లడించారు. తాజాగా(ఆదివారం) జలియన్ వాలా బాగ్ ఊచకోతకు 106 ఏండ్లు పూర్తి అయిందని గుర్తు చేశారు.  

ఇందులో   శంకరన్ నాయర్ అనే వీరుడి కథ చీకటిలో మగ్గిపోయిందని తెలిపారు.  జలియన్‌‌వాలా బాగ్ ఊచకోత సమయంలో బ్రిటిష్ అధికారుల అకృత్యాలను బహిరంగంగా ఎండగట్టి, తన ఉన్నత పదవిని వదులుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం మానవతకు సంబంధించిన విషయం కాదని,‘ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్’ కు ఉత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తి అసలైన స్వాతంత్ర్యోద్యమానికి నిజమైన ప్రేరణ అని, ఇది  నేటి ‘వికసిత్ భారత్’ సాధనకు అవసరం అని తెలిపారు.