
న్యూఢిల్లీ: రాజ్యాంగమే తమకు దారి చూపే వెలుగు రేఖ అని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరితోనూ కలిసి పని చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉందన్నది చూడకుండా అన్ని రాష్ట్రాలనూ కలుపుకొని ముందుకెళ్తామని చెప్పారు. తన ప్రభుత్వం మహిళలు, యువత అభివృద్ధికి కృషి కొనసాగిస్తుందన్నారు. ‘‘బలమైన ఇండియా.. బలమైన ప్రపంచానికి బలమైన స్తంభంలా నిలుస్తుంది” అని చెప్పారు.
మంగళవారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి తన ప్రభుత్వంలో అనేక కీలకమైన అంశాలపై ఫోకస్ పెడుతున్నానని, ప్రధానంగా అన్ని రకాల అవినీతిని కూకటివేళ్లతో పెకలించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో తాము క్లీన్ స్వీప్ చేశామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, ప్రతిపక్ష కూటమికి వచ్చిన మొత్తం సీట్ల కన్నా బీజేపీకి వచ్చిన సీట్లే ఎక్కువన్నారు. అయితే, గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గిపోయిన విషయాన్ని మాత్రం దాటవేశారు. దేశ చరిత్రలో ఆరు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారని మోదీ అన్నారు.