హైదరాబాద్: శ్రీరామానుజాచార్యుల బోధనలు ఎప్పటికీ అనుసరణీయమైనవని, ఆయన చేసిన బోధనల సారాన్నే తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మారుతున్న భారతావనిలో ప్రతి ఒక్కరూ సమానంగా, ఒకే విధమైన ప్రయోజనం, గౌరవం పొందాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఈ రకమైన విధానం ఉండాలనే రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే సందేశం ఇచ్చారని చెప్పారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల (సమతా మూర్తి) విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం జాతికి అంకితం చేశారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను రామానుజాచార్యులు ఎంతో ప్రత్యేకంగా గౌరవించారని, పుట్టిన జాతి వల్ల కాకుండా గుణం వల్ల గౌరవం లభించాలని, మానవులంతా సమానమేనని ఆయన చెప్పారని మోడీ అన్నారు. రామానుజుల వారు 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించారని, మూఢ విశ్వాసాలను పారద్రోలి, భక్తికి కులం, జాతితో సంబంధం లేదని, అంతా సమానమేనని చాటి చెప్పారని అన్నారు. రామానుజుల వారి సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని, ప్రాచీన కాలంలోనే కులం, జాతి భేదాలు ఉండకూడదని చాటిన సమాతా మూర్తి రామానుజులు అయితే, ఆధునిక భారతంలో అమానతల నివారణకు కృషి చేసిన గొప్ప మనిషి అంబేద్కర్ అని అన్నారు.
ఈ యాగ ఫలం ప్రతి భారతీయుడికి దక్కాలి
కాగా, ప్రధాని మోడీ సమాతా మూర్తి విగ్రహావిష్కరణకు ముందు విశ్వక్‌సేనేష్టి యాగం చేశారు. సంకల్పం సిద్ధి కోసం చేసే ఈ యాగ ఫలితం యావత్ భారతీయులందరికీ దక్కాలని తాను ఆకాంక్షిస్తున్నాని మోడీ చెప్పారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్య క్షేత్రాల (108 దివ్య దేశాలు) దర్శనం.. దేశమంతా తరిగి ఆయా ఆలయాలను దర్శించిన అనుభూతిని కలగించిందని మోడీ చెప్పారు. వసంత పంచమి రోజున రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇంతటి విశాలమైన భారతావనిలో మానవతా విలువలకు ప్రేరణగా నిలిచే మూర్తిగా రామానుజులు ఇక్కడ ప్రతిష్టించడం నవ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
పటేల్ ఐక్యతకు.. రామానుజుల వారు సమానత్వానికి ప్రతీక
హైదరాబాద్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారని ప్రధాని మోడీ అన్నారు. హైదరాబాద్ స్వేచ్చ, విముక్తి కోసం సర్దార్ పటేల్ కృషి చేశారని అన్నారు. సర్దార్ పటేల్ విగ్రహం ఐక్యతకు చిహ్నంగా నిలిస్తే.. రామానుజాచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకగా స్ఫూర్తిని నింపుతుందని అన్నారు.
పర్యాటకంలో గొప్పగా ముందుకు..
తెలంగాణ పర్యాటకంగా ఎంతగానో ఎదుగుతోందని, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని మోడీ అన్నారు. పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. ఇక సమాతా మూర్తి కేంద్రం కూడా పర్యాటకంగా గొప్పగా నిలవబోతోందని మోడీ చెప్పారు. మరోవైపు తెలుగు సినిమా రంగం కూడా ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని గడిస్తోందని, వెండి తెర మొదలు ఓటీటీల వరకు తెలుగు వాళ్లు సత్తా చాటుతున్నారని మోడీ అన్నారు.