ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయిన ప్రధాని మోడీ

ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయిన ప్రధాని మోడీ

చండీఘడ్: పంజాబ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీకి నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు నిరసన చేపట్టడంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయింది. పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మండిపడింది.
పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ హుస్సేనీవాలాలోని అమరవీరుల స్మారకాన్ని వద్ద నివాళులర్పించేందుకు భఠిండాకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా స్మారకం వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ అధికారులు పంజాబ్ డీజీపీకి ముందుగానే సమాచారం అందించారు. అయితే మార్గమధ్యంలో ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకోగానే కొందరు నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు కాన్వాయ్ను అడ్డుకోవడంతో ప్రధాని మోడీ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఫలితంగా పీఎం మోడీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే మోడీ పర్యటన రద్దైందని మండిపడింది. దీనికి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.