అయోధ్యలో సోమవారం శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దక్షిణాదిన రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలను ప్రధాని మోదీ దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం తమిళనాడులో పర్యటించారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. రామేశ్వరంలోని అగ్ని తీర్థం బీచ్‌లో పవిత్ర స్నానాన్ని ఆచరించారు. తర్వాత రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రుద్రాక్షమాల ధరించి స్వామి వారికి పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన భజనలోనూ పాల్గొన్నారు.
తిరుచిరాపల్లి/రామేశ్వరం: శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. తమిళ సంప్రదాయ దుస్తులు పంచె, అంగవస్త్రం ధరించి.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడు పర్యటనలో భాగంగా శనివారం చెన్నై నుంచి తిరుచిరాపల్లికి ప్రధాని చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ శ్రీరంగం చేరుకున్నారు. ఈ సందర్భంగా జనం ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ప్రధానికి రంగనాథ స్వామి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో గజరాజు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయించడం విశేషం. ఆలయంలో కొద్దిసేపు కంబ రామాయణ పద్యాలను మోదీ విన్నారు. రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.
రామాయణంతో ముడిపడిన ఆలయాలకు..
22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దక్షిణాదిన రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలను మోదీ దర్శించుకుంటున్నారు. 16న ఏపీలోని సత్యసాయి జిల్లాలో వీరభద్రుడి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇక 17న కేరళలోని త్రిస్సూర్‌లో త్రిప్రాయర్ శ్రీ రామస్వామి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు.
అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం
రామేశ్వరంలోని అగ్ని తీర్థం బీచ్‌లో పవిత్ర స్నానాన్ని ప్రధాని మోదీ ఆచరించారు. తర్వాత రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రుద్రాక్షమాల ధరించి స్వామి వారికి పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన భజనలోనూ పాల్గొన్నారు. తిరుచిరాపల్లిలో రామనాథస్వామిని దర్శించుకున్న తర్వాత ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో ప్రధాని ఇక్కడికి చేరుకున్నారు.