
న్యూఢిల్లీ: మనం ఇదివరకే దిగిన ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్ట్ సాయంతో కార్టూన్ బొమ్మల మాదిరిగా మార్చేసే ‘జిబ్లీ ట్రెండ్’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ ట్రెండ్ ను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రై చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్ తో ఆయన దిగిన ఫొటోలను జిబ్లీ స్టైల్ లోకి మార్చారు. ఈ ఫొటోలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‘ఎక్స్’లో రిలీజ్ చేసింది. ‘‘మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? కాదు.
మొత్తం స్టోరీ లైన్ ఆయనే. న్యూ ఇండియాను స్టూడియో జిబ్లీ ఆర్ట్ లో చూడండి” అని క్యాప్షన్ పెట్టింది. మోదీ త్రివర్ణ పతాకం పట్టుకుని ఉన్న ఫొటో, ఆర్మీ యూనిఫామ్ తో ఉన్న ఫొటోతోపాటు మొత్తం 12 జిబ్లీ పోర్ట్రయిట్లను ట్వీట్ కు జత చేసింది. పార్లమెంట్ లో సెంగోల్ ప్రతిష్ఠాపన, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన, వందే భారత్ ట్రెయిన్ ప్రారంభం, తేజస్ యుద్ధవిమానంలో విహారం, మాల్దీవుల పర్యటన, స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నప్పటి మోదీ ఫొటోలు కూడా ఇందులో ఉన్నాయి.
ఏమిటీ జిబ్లీ ఆర్ట్?
జపాన్ కు చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ ‘స్టూడియో జిబ్లీ’ ఈ జిబ్లీ ఆర్ట్ ను మొదట ప్రారంభించింది. నిజమైన ఫొటోలను కార్టూన్ టైప్ చిత్రాల్లో మార్చి చూపడం ఈ ఆర్ట్ ప్రత్యేకత. అయితే, ఇప్పుడు రోజుకో కొత్త ఏఐ టూల్స్ వస్తుండటంతోపాటు ప్రతి అంశంలోనూ ఏఐ వినియోగం పెరిగిపోతోంది. తాజాగా ఈ జిబ్లీ ఆర్ట్ కూ అనేక కంపెనీలు ఏఐ టెక్ ను జోడించాయి.
నిజమైన ఫొటోలను అప్ లోడ్ చేసి, జిబ్లీ స్టైల్ లోకి మార్చాలని ఆర్డర్ వేస్తే చాలు.. చాట్ జీపీటీ, గ్రోక్, రన్ వే ఎంఎల్ వంటి ఏఐ టూల్స్ క్షణాల్లో వాటిని మార్చి ఇస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఫొటోలను కూడా ఆయన ఆఫీసు సిబ్బంది ఇలా ట్రై చేశారు. దీంతో ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.