
ఛండీగఢ్: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దార్శనికతకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ప్రధాని మోడీ విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడిన అంబేద్కర్ ఆదర్శాలను తుంగలో తొక్కి.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను అల్పవర్గ పౌరులుగా చూస్తోందని ఫైర్ అయ్యారు. సోమవారం హర్యానాలోని హిసార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం కావాలని కలలు కన్నాడు.. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి ఆయన దార్శనికతను అడ్డుకుందని ధ్వజమెత్తారు.
అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా అవమానించిందని.. చివరకు ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని ఆరోపించారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అధికారం కోసం ఒక ఆయుధంగా మార్చుకుందని.. తన అధికారానికి ముప్పు ఉందని భావించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులతో సహా ఎవరికీ ప్రయోజనం చేకూర్చడానికి కాంగ్రెస్ ఎప్పుడూ రాజ్యాంగాన్ని ఉపయోగించలేదని ఆరోపించారు.
Also Read :- కంచ గచ్చిబౌలి భూములపై మోదీ కీలక వ్యాఖ్యలు
అలాగే.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడంపై ప్రధాని మోడీ మండిపడ్డారు. మతవాదులను సంతృప్తి పర్చడం కోసమే కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మతవాదులను మాత్రమే సంతృప్తి పరచింది.. దీనికి అతిపెద్ద రుజువు వక్ఫ్ చట్టమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ బోర్డుకు కేటాయించారు.. కానీ పేద ముస్లింలు ఈ భూమితో ఎప్పుడూ ప్రయోజనం పొందలేదు. కేవలం భూ మాఫియా మాత్రమే వక్ఫ్ భూములతో లాభపడిందని.. ఈ దోపిడీ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంతో ఆగిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టం నిజమైన సామాజిక న్యాయం.. - పేద ముస్లింల హక్కులను నిర్ధారించడమన్నారు.