
న్యూఢిల్లీ: క్రికెట్‌లో పాకిస్తాన్ కంటే ఇండియా జట్టు ఎంతో మెరుగ్గా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫలితాలే ఈ విషయం చెబుతున్నాయని అన్నారు. అమెరికన్ పోడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్ తో మాట్లాడిన మోదీ క్రీడలకు ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి ఉందన్నారు. ‘నేను క్రికెట్ ఎక్స్‌పర్ట్‌ను కాదు. ఈ ఆటలో టెక్నిక్ గురించి కూడా నాకు తెలియదు. కానీ, కొన్ని రోజుల కిందటే ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
అందులో ఫలితం చూసిన తర్వాత ఏ జట్టు మెరుగైనదో స్పష్టమవుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో విన్నర్‌గా నిలిచిన ఇండియా మెగా టోర్నీలో పాక్‌ను చిత్తుగా ఓడించింది. ఇక, ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంటుందన్న మోదీ వాటిని ఎప్పుడూ వివాదాస్పదం చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఫుట్‌బాల్‌లో గొప్ప ఆటగాడు ఎవరన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘1980ల్లో మారడోనా పేరు మార్మోగింది. ఆ తరానికి తను నిజమైన హీరో. నేటి తరానికి మెస్సీ గొప్ప ప్లేయర్’ అని మోదీ చెప్పారు