జలియన్​వాలాబాగ్​ అమరుల త్యాగాలకు స్మారక స్ఫూర్తి

దేశ స్వాతంత్ర్య పోరాటంలో నెత్తుటి అధ్యాయం ఘ‌‌ట‌‌న జ‌‌లియ‌‌న్ వాలాబాగ్‌‌. 1919 ఏప్రిల్‌‌13న వైశాఖి పర్వదిన వేడుకల్లో పాల్గొన్న అమాయకులపై బ్రిటీష్‌‌ బ్రిగేడియర్‌‌- జనరల్‌‌ రెజినాల్డ్‌‌ డయ్యర్‌‌ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించాడు. ఈ మార‌‌ణ‌‌కాండలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు అమృత్​సర్ ​సిటీలో జలియన్​వాలాబాగ్​ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నేడు(ఆగస్టు 28) దీనిని ప్రారంభించనున్నారు.

తొలి స్వాతంత్ర్య సంగ్రామం 1857లో మొదలైన​ప్పటి నుంచే బ్రిటీష్‌‌ పాలకుల్లో వణుకు స్టార్ట్​అయింది. తమ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాలు చెలరేగే ఆస్కారం ఉందనే భయం వారిని వెంటాడింది. అందుకే 20వ శతాబ్ద ఆరంభంలో లాలా హర్‌‌దయాళ్‌‌, లాలా లజపత్‌‌ రాయ్‌‌, అజిత్‌‌ సింగ్‌‌ వంటి నాయకులకు దేశ బహిష్కరణ విధించింది. అయినా బ్రిటీష్‌‌ పాలకుల్లో భయం తగ్గలేదు. కొందరు రాజకీయ నేతల మెతక ధోరణిని అలుసుగా తీసుకొని, అణచివేత చర్యలు చేపడితే జనంలో పెరుగుతున్న జాతీయ భావనను అంతమొందించవచ్చని, తద్వారా ఆటంకాలు లేకుండా పాలన కొనసాగించవచ్చని భావించారు. మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా వారికి, వారి మిత్ర దేశాలకు భారత ప్రజానీకం ఇచ్చిన మద్దతు, భారత సైనికులు చూపిన ధైర్యసాహసాల పట్ల వారిలో కనీస కృతజ్ఞతా భావన కూడా కనిపించలేదు. అందుకే శాంతియుత బంద్‌‌ ద్వారా నిరసన ప్రకటించడాన్ని కూడా తీవ్ర చర్యగా పరిగణించడం మొదలు పెట్టారు. 

హక్కుల అణచివేత

ప్రజల హక్కుల అణచివేత కోసం ఎంతటి దారుణానికైనా సిద్ధమైన ఆనాటి పంజాబ్‌‌ లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌ మైకేల్‌‌ ఓ డయ్యర్‌‌ చర్యలు బ్రిటీష్‌‌ పాలకుల వికృత ఆలోచనలకు అద్దం పడతాయి. విద్యావంతులను ఘోరంగా అవమానించడం, వందలాది మందిని కటకటాల్లోకి నెట్టడమే కాకుండా పత్రికా రంగం నోరు నొక్కారు.1919 ఏప్రిల్‌‌ నుంచి పరిస్థితులు మరింత దిగజారాయి. లాహోర్‌‌, అమృత్​సర్‌‌ నగరాల్లో శాంతియుత బంద్‌‌లను కూడా బలప్రయోగంతో అణచివేశారు. అంతటితో ఆగని బ్రిటీష్​సైన్యం నిరసనకారులపై కాల్పులు జరిపింది. అనేక మంది ముఖ్యమైన నాయకులను అరెస్ట్‌‌ చేసి, దేశ బహిష్కారం విధించింది. లాహోర్‌‌, అమృత్​సర్‌‌లలోపాటు కసూర్‌‌, గుజరన్‌‌వాలా వంటి ప్రాంతాల్లోనూ దారుణ పరిస్థితులు కొనసాగాయి. బ్రిటీష్​ గవర్నమెంట్​శాంతియుత ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రజలను రెచ్చగొట్టేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంది. ఎలాంటి హింసాత్మక పరిస్థితులు లేకపోయినా అనవసరంగా కాల్పులు జరపడంతో అమృతసర్‌‌లో ఐదుగురు ఐరోపావాసులు చనిపోయారు. కొందరు భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లిన షేర్‌‌వుడ్‌‌ అనే మహిళ మిషనరీ వీధిలో దెబ్బలు తినాల్సి రావడంతో పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. 

చరిత్రలో చీకటి రోజు

జలియన్‌‌వాలాబాగ్‌‌ ఉదంతానికి ఒకరోజు ముందు బ్రిగేడియర్‌‌- జనరల్‌‌ రెజినాల్డ్‌‌ డయ్యర్‌‌ జలంధర్‌‌ నుంచి అమృతసర్‌‌కు బదిలీ అయ్యాడు. ఆయన వచ్చీరాగానే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటంపై ఆంక్షలు పెట్టాడు.  13 ఏప్రిల్1919 ఆదివారం రోజున అమృత్‌‌సర్ పట్టణంలో గల ‘జలియన్ వాలా’ అనే తోటలో సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ వేడుక‌‌లు చేసుకునేందుకు దాదాపు 20 వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్నచిన్న ద్వారాలు ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. ఈ స‌‌మావేశం సమాచారం తెలుసుకున్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడింది. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైన వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకదాటిగా పది నిమిషాలపాటు సైన్యం కాల్పులు కొనసాగించింది. క్షణాల వ్యవధిలోనే సాయుధ బలగాలు1650 రౌండ్ల మేర కాల్పులు జరపగా, పెద్దసంఖ్యలో అమాయకులు తూటాలకు ప్రాణాలొదిలారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది చాలదన్నట్లు పుండుమీద కారం చల్లే విధంగా డయ్యర్​జన సంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు. మృతదేహాల తరలింపును అడ్డుకోవడమేగాక చివరకు క్షతగాత్రులకు చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది.

హంటర్​ కమిటీ

ఈ ఘోరకలిపై విచారణకు ఏర్పాటైన ‘హంటర్‌‌ కమిటీ’ ప్రశ్నలకు డయ్యర్‌‌ ఇచ్చిన సమాధానాలు అతడి మానసిక స్థితినే కాకుండా పాలన వ్యవస్థ వికృత ధోరణినీ స్పష్టం చేశాయి. ముందస్తు ప్రణాళికబద్ధ వ్యూహం ప్రకారం పూర్తి అవగాహనతోనే తాను చర్యలు తీసుకున్నానని అతడు ఎలాంటి జంకులేకుండా చెప్పడం గమనార్హం. సదరు విచారణ అనంతరం డయ్యర్‌‌ను ప్రత్యక్ష విధుల నుంచి తొలగించడం తప్ప ప్రభుత్వం అతడిపై మిగతా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు అప్పటి లెఫ్టినెంట్‌‌ గవర్నర్‌‌ అతడిపై అభియోగాలను పూర్తిగా రద్దుచేసింది.

ఉద్ధమ్​సింగ్​ ప్రతీకారం

ఆంగ్లేయుల దృష్టిలో తానో ధీరుడనని భావించిన డయ్యర్‌‌ తిరిగి తన స్థానం పొందడానికి సకల ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అతడిపై భారతీయుల ఆగ్రహావేశాలు తీవ్రస్థాయిలో ఉండటమే ఇందుకు కారణం. ఈ విషాద సంఘటన తర్వాత భారతీయుల మనోభావాలను, తదనంతర పరిణామాలను పసిగట్టడంలో బ్రిటీష్‌‌ పాలకులు విఫలమయ్యారు. రక్తం మరిగిపోతున్న యువ భారతీయులు బిట్రీష్ ​క్రూరత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమయ్యారు. నాటి అసమాన విప్లవకారుడు ఉద్ధం సింగ్‌‌ ఈ బాధ్యతను తన భుజాలకెత్తుకున్నాడు. లండన్‌‌ సిటీలో 1940 మార్చి 13న డయ్యర్‌‌ను కాల్చి చంపాడు. జలియన్‌‌వాలా బాగ్‌‌ ఉదంతానికి, తదుపరి సంఘటనలకు ప్రత్యక్ష ఫలితమే భగత్‌‌ సింగ్‌‌, చంద్రశేఖర్‌‌ ఆజాద్‌‌ వంటి యువ దేశభక్త విప్లవకారుల ఆవిర్భావం. ఇటువంటి ఎందరో వీరుల ఎనలేని త్యాగఫలితమే మన స్వాతంత్ర్యం. యావత్తు జాతి వారికి రుణపడి ఉంది.

మెమోరియల్​ కాంప్లెక్స్

అమృత్‌‌సర్‌‌లోని జలియన్‌‌వాలా బాగ్ మెమోరియల్ కాంప్లెక్స్ ను నాలుగు మ్యూజియం గ్యాలరీలతో రినోవేట్​ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం ఈ కాంప్లెక్స్‌‌ను ప్రారంభించనున్నారు. మ్యూజియం గ్యాలరీల ఏర్పాటులో మోడర్న్​ ఆడియో విజువల్​ టెక్నాలజీ వాడారు. ఏప్రిల్ 13న జరిగిన ఘటనను ప్రదర్శించడానికి ప్రత్యేకంగా సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. పంజాబ్​లో జరిగిన సంఘటనలు కళ్లకుకట్టేలా శిల్ప సౌందర్యాన్ని తీర్చిదిద్దారు. లోకల్​ ఆర్కిటెక్చర్​ శైలికి అనుగుణంగా మెమోరియల్ ​కాంప్లెక్స్​ హెరిటేజ్​ రినోవేషన్​ పనులు చేపట్టారు. ఇటీవల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అమృత్‌‌సర్‌‌లో జలియన్ వాలా బాగ్ సెంటినరీ మెమోరియల్ పార్క్‌‌ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్మారక నిర్మాణం కోసం రాష్ట్రంలోని ఆయా గ్రామాల నుంచి మట్టి తీసుకురావడం విశేషం. 

- అశ్వనీ అగ్రవాల్‌‌, 
నేషనల్​ మాన్యుమెంట్​ అథారిటీ, శాశ్వత సభ్యులు