- మూడ్రోజుల పాటు సియాలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్
- పార్ట్నర్ స్టేట్‌గా తెలంగాణ
- రాష్ట్ర ఐటీ మంత్రి నేతృత్వంలో పాల్గొననున్న 10 మంది టీమ్
- హాజరుకానున్న 45 దేశాల ప్రతినిధులు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం నుంచి ఆసియాలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐంఎసీ)–2024 ప్రారంభం కానుంది. మూడు రోజులు జరిగే ఈవెంట్ లో తెలంగాణ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) క్యాపిటల్ పార్ట్ నర్ గా తెలంగాణ ఏఐ విజన్ ను ప్రకటించనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ), సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మంగళవారం ఉదయం10 గంటలకు ఈ ఈవెంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పలు రాష్ట్రాల ఐటీ మంత్రులు, 45 దేశాల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రితో పాటు10 మంది సాంకేతిక నిపుణుల బృందం కూడా ఇందులో పాల్గొననుంది. ప్రధాన హాల్, ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేసింది.
రెండో రోజు తెలంగాణ ప్రజెంటేషన్..
ఐఎంసీ సదస్సులో రెండో రోజు(బుధవారం) రాష్ట్ర ఏఐ మిషన్ విజన్ పై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. రాష్ట్రంలో టెలికాం, డిజిటల్ ల్యాండ్ స్కేప్ అభివృద్ధిని చాటనున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించనున్నారు.