![కనెక్టివిటీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి 5జీ](https://static.v6velugu.com/uploads/2022/09/PM-Modi-to-launch-5G-services-on-Oct-1_gAor5Q6BDU.jpg)
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో 5జీ సేవలను వచ్చే నెల ఒకటో తేదీన ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇండియా డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ను, కనెక్టివిటీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి 5జీ ఉపయోగపడుతుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ అని ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా ఇండియా హెడ్ రవీందర్ టక్కర్ ఈ సందర్భంగా ప్రధాని మోడీతో వేదికను పంచుకుంటారని సంబంధిత ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కూడా పాల్గొంటారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) అక్టోబరు 1-4 వరకు కొనసాగుతుందని, ఇది ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా టెక్నాలజీ ఫోరం అని పేర్కొంది.
దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తాయి. ఈ ఏడాది ఆగస్టులో 5జీ స్పెక్ట్రమ్ వేలం నుంచి 1.50 లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది. స్పెక్ట్రమ్ సేల్‌లో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి. అదానీ గ్రూప్ తన సొంత అవసరాల కోసం స్పెక్ర్టమ్ను కొన్నది. ఈ అక్టోబర్ నుంచి దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. 5జీ సేవలు ప్రారంభించిన తర్వాత పెద్ద ఎత్తున విస్తరిస్తామని, రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాలలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా ఆయన తెలిపారు. పీఎం మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 5జీ గురించి మాట్లాడుతూ ఈ టెక్నాలజీ 4జీ కంటే 10 రెట్ల నెట్స్పీడ్ను అందిస్తుందని, త్వరలో భారతదేశమంతటా ప్రారంభమవుతుందని చెప్పారు. భారతీయ గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ అందుబాటులోకి వస్తుందని, దీనివల్ల మారుమూల ప్రాంతాలూ ఇంటర్నెట్ను వాడుకోవచ్చని ఆయన అన్నారు. 5జీ నెట్స్పీడ్ దాదాపు 100 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. హై-స్పీడ్ డేటా కాకుండా, మెషిన్- టు- మెషిన్ కమ్యూనికేషన్‌లు, కనెక్టెడ్ వెహికల్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి అనేక ఎంటర్‌ప్రైజ్ -స్థాయి సొల్యూషన్లు కూడా 5జీతో సాధ్యమవుతాయి.