ఇయ్యాల(అక్టోబర్ 3) ఇందూరులో మోదీ సభ

  • రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టులకు  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • ఎన్టీపీసీ మొదటి యూనిట్​ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
  • సిద్దిపేట - సికింద్రాబాద్​ రైలు సర్వీస్​ సహా పలు రైల్వే ప్రాజెక్టులకు ఓపెనింగ్స్​
  • రాష్ట్రవ్యాప్తంగా 20 క్రిటికల్​ కేర్​ బ్లాక్​లకు శంకుస్థాపనలు
  • పసుపు బోర్డు ప్రకటనతో కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధమైన రైతులు

న్యూఢిల్లీ/నిజామాబాద్​, వెలుగు:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నిజామాబాద్​కు రానున్నారు. భారీ బహిరంగ సభలో  ప్రసంగించనున్నారు. విద్యుత్, రైల్వే, హెల్త్​ రంగాలకు సంబంధించి దాదాపు రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సభ కోసం బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం పాలమూరు పర్యటనలో ప్రధాని మోదీ రాష్ట్రానికి పసుపు బోర్డును ప్రకటించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద ఎత్తున రైతులు ఇందూరు సభకు వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పసుపు బోర్డు ప్రకటనపై ఇందూరులో సంబురాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల తమ కల సాకారమైందని రైతులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. 

ఒక్క రోజు తేడాతోనే రాష్ట్రానికి ప్రధాని వస్తుండటంతో బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తున్నది. ఇందూరు సభను సక్సెస్​ చేసేందుకు వాళ్లు కృషి చేస్తున్నారు. నిజామాబాద్ ​ప్రభుత్వ గిరిరాజ్​ డిగ్రీ కాలేజీ మైదానంలో మోదీ సభ జరుగనుంది. దీనికి మొదట ‘ఇందూరు జనగర్జన’ సభ అని పేరు పెట్టినప్పటికీ.. పసుపు బోర్డును ప్రకటించినందున ‘ధన్యవాద్​’ సభగా మార్చారు. 

ఉదయం చత్తీస్​గఢ్​లో..

మంగళవారం ఉదయం ప్రధాని మోదీ చత్తీస్​గఢ్​లో పర్యటిస్తారని, ఆ తర్వాత మధ్యాహ్నం తెలంగాణకు చేరుకుంటారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఉద‌‌యం 11 గంట‌‌ల‌‌కు చత్తీస్ గఢ్​ రాష్ట్రంలోని బ‌‌స్తర్‌‌ జిల్లా జ‌‌గ్దల్‌‌పూర్‌‌ కు ప్రధాని చేరుకుంటారని తెలిపింది. అక్కడ దాదాపు రూ. 26 వేల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని, నగర్నార్ వద్ద ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌‌ ను జాతికి అంకితం చేస్తారని వెల్లడించింది. అనంతరం బస్తర్​ నుంచి నిజామాబాద్​కు మోదీ బయలుదేరుతారని, మధ్యాహ్నం 3 గంటల వరకు నిజామాబాద్​కు చేరుకుంటారని పీఎంవో పేర్కొంది. 

20 క్రిటికల్ కేర్ బ్లాక్​లకు శంకుస్థాపన

తెలంగాణలో హెల్త్​ రంగంలో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ కింద రాష్ట్రవ్యాప్తంగా 20 క్రిటికల్ కేర్ బ్లాక్‌‌ (సీసీబీ)లకు ప్రధాని మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ (బాదేపల్లి), ములుగు, నాగర్‌‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి (మహేశ్వరం) సూర్యాపేట, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ (నర్సంపేట) జిల్లాల్లో ఈ సీసీబీలను నిర్మించనున్నారు. ఈ సీసీబీలు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తెలంగాణ అంతటా జిల్లా స్థాయి క్రిటికల్ కేర్ మౌలిక సదుపాయాలను పెంచుతాయని పీఎంవో తెలిపింది.

పల్లె పల్లె నుంచి రైతులు

రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్న ప్రధాని మోదీ ప్రకటనతో నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా మోదీ ఇందూరు సభకు రైతులు వస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్​, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి వేలాది మంది పసుపు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజామాబాద్​ రూరల్​, ఆర్మూర్​నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి రైతులు పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. పసుపు బోర్డు సాధిస్తానని రైతులకు బాండ్​ పేపర్​ రాసిచ్చి మరీ మాట నిలుపుకున్న ఎంపీ అర్వింద్ .. మంగళవారం నిర్వహించబోయే మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

మొదట ‘ఇందూరు జన గర్జన’ పేరుతో సభ నిర్వహించాలని భావించినప్పటికీ  మోదీ  పసుపు బోర్డును ప్రకటించిన నేపథ్యంలో ఈ సభకు ‘ధన్యవాద్​ సభ’గా పేరు మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నిజామాబాద్​ప్రభుత్వ గిరిరాజ్​ డిగ్రీ కాలేజీ మైదానంలో మోదీ సభ జరుగనుంది. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు సభ ఉంటుంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్​, బాల్కొండ, ఆర్మూర్​, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో పసుపు రైతులు వస్తారన్న సమాచారం మేరకు వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వాటర్​ప్రూఫ్​టెంట్లు వేయించారు. 

మూడు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు

ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ కమెండోలు సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ కంట్రోల్​లోకి తీసుకున్నారు. కొత్త కలెక్టరేట్​లోని హెలిప్యాడ్​లో హెలిక్యాప్టర్​ దిగాక కిలోమీటర్​ దూరంలోని సభా ప్రాంగణానికి చేరుకునే మార్గంలో ఎస్పీజీ ఆఫీసర్లు సోమవారం ట్రయల్ నిర్వహించారు. సభా వేదిక నుంచి చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని రెడ్​జోన్​గా ప్రకటించి.. నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చారు. ఎస్పీజీ అధ్వర్యంలో మొత్తం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిజామాబాద్​ ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, కమిషనర్​ సత్యనారాయణ, ఆదిలాబాద్​, భూపాలపల్లి, పెద్దపల్లి, నిర్మల్​, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఎస్పీలు, ఇద్దరు బెటాలియన్​ కమాండెంట్లు, 13 మంది చొప్పున అడిషనల్​ ఎస్పీలు, ఏసీపీలు, 107 మంది సీఐలు, 200 మంది ఎస్​ఐలతో పాటు ఏఎస్​ఐ, కానిస్టేబుల్స్​తో కలిపి 1,900 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారు.

సిద్దిపేట టు సికింద్రాబాద్​ రైలు

ప్రధాని తన ఇందూరు పర్యటనలో భాగంగా రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 76 కిలోమీటర్ల పొడవైన మనోహరాబాద్ - సిద్దిపేట కొత్త రైల్వేలైన్‌‌, ధర్మాబాద్- మనో హరాబాద్, మహబూబ్​నగర్ - కర్నూలు రైల్వేలైన్​ మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మనోహరాబాద్ - సిద్దిపేట రైలు మార్గం ఈ ప్రాంతం సామా జిక - ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా మెదక్, సిద్దిపేట జిల్లాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని పీఎంవో పేర్కొంది.  ధర్మా బాద్ - మనోహరాబాద్, మహబూబ్‌‌నగర్ - కర్నూల్ మధ్య విద్యుదీకరణ ప్రాజెక్ట్ రైళ్ల సగ  టు వేగాన్ని మెరుగుపరచడానికి సహాయప డుతందని తెలిపింది. సుదీర్ఘ కాలం నుంచి ఎదురుచూస్తున్న సిద్దిపేట - సికింద్రాబాద్  - సిద్దిపేట రైలు సర్వీసును కూడా ప్రధాని ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది.

ఎన్టీపీసీ యూనిట్​ జాతికి అంకితం

దేశంలో మెరుగైన ఇంధన సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో నిర్మించిన రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదటి 800 మెగావాట్ల యూనిట్‌‌ను ఇందూరు వేదికగా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణకు తక్కువ ధరకే విద్యుత్‌‌ను అందించడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ యూనిట్ ఊతమివ్వ నుందని, దేశంలోని అత్యంత పర్యావరణ అనుకూల పవర్ స్టేషన్లలో ఈ ప్రాజెక్ట్ చోటు దక్కించుకోనుందని పీఎంవో తెలిపింది.