- సమతా మూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని
- ఇక్రిశాట్స్వర్ణోత్సవాలకు హాజరు
- ముచ్చింతల్, ఇక్రిశాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
- సెంట్రల్ఫోర్స్తోపాటు 8 వేల మంది పోలీసులa మోహరింపు
- నేడు ముచ్చింతల్‌లో సాధారణ ప్రజలకు నో ఎంట్రీ
హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొంటారు. 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ఈక్వాలిటీ)ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్టప్రాంత పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) స్వర్ణోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో పంజాబ్‌లో జరిగిన ఇన్సిడెంట్దృష్ట్యా ప్రధాని టూర్లో ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోడీ భద్రత కోసం సెంట్రల్ఫోర్స్తోపాటు దాదాపు 8 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. శనివారం ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననుండటంతో సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే ముచ్చింతల్ గ్రామం పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆక్టోపస్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, సైబరాబాద్ పోలీసుల సహకారంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు వేదికల వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. రెండు సభా వేదికలను పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లో గాలిలో డ్రోన్లు ఎగురకుండా నిషేధం విధించారు. పీఎం టూర్ ఏర్పాట్లపై పీఎంవో కూడా ఆరా తీసింది.
ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్, డీజీపీ
పీఎం మోడీ హైదరాబాద్ పర్యటన ఏర్పాట్లను సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పీఎం, రాష్ట్రపతి ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈ నెల14వ తేదీ వరకు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్అధికారులను ఆదేశించారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదని, ప్రత్యేక పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. యాగశాలను, అక్కడ అగ్నిమాపక శాఖ, విద్యుత్, శానిటేషన్, ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్ ను, పీఎం బస చేసే గెస్ట్ హౌస్ ను సీఎస్ పరిశీలించారు.
పర్యటన ఇలా..
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.45 గంటలకు హెలికాప్టర్ లో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ కు వెళ్లారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొని ఇక్రిశాట్కొత్త లోగోను మోడీ ఆవిష్కరించనున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభిస్తారు. 4.15 గంటల వరకు ఇక్రిశాట్లో ఉండి అక్కడి నుంచి మళ్లీ హెలికాప్టర్లో శంషాబాద్ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన్న జీయర్ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. 8.-40కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.