హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ రేపు హైదరాబాద్కు రానున్నారు. ఇక్రిశాట్ను సందర్శించిన అనంతరం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ముచ్చింతల్ లో పర్యటించారు. అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూంతో పాటు ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్, మోడీ బస చేసే గెస్ట్ హౌస్ను పరిశీలించారు.
ప్రధాని ఆవిష్కరించనున్న 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహంతో పాటు పరిసర ప్రాంతాలను సోమేష్ కుమార్, మహేందర్ రెడ్డిలు పరిశీలించారు. ప్రధాని వచ్చి వెళ్లే మార్గాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎస్పీజీ అనుమతించిన వారు మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులకు స్పష్టం చేశారు. అనంతరం యాగశాలకు వెళ్లిన సీఎస్, డీజీపీలు ప్రసాదం స్వీకరించారు. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.