ఇవాళ (జనవరి 6న) చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్

ఇవాళ (జనవరి 6న) చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్
  • వర్చువల్‌‌‌‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్టులు, రెండు రైళ్లు కూడా

న్యూఢిల్లీ/ సికింద్రాబాద్, వెలుగు: ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి వర్చువల్‌‌‌‌గా ఈ టెర్మినల్‌‌‌‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆదివారం పీఎంవో ఒక ప్రకటనలో వెల్లడించింది. అమృత్​ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్‌‌‌‌ను రూ.413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, మేయర్​ జయలక్ష్మి, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు హాజరుకానున్నారు.

పలు రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్

చర్లపల్లి నుంచి ప్రధాని మోదీ రెండు సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. అలాగే సోమవారం  నుంచి ఇక్కడ కొన్ని రైళ్లకు కొత్తగా హాల్టింగు ఇచ్చారు. ఇప్పటి వరకు ట్రైన్ నంబరు 12603 చెన్నై–సికింద్రాబాద్ పేరుతో నడుస్తున్న రైలు ఈ నెల 7 నుంచి ట్రైన్ నంబరు 12603 చెన్నై సెంట్రల్–చర్లపల్లి పేరుతో నడవనుంది. ట్రైన్ నంబరు 12604 సికింద్రాబద్-చెన్నై సెంట్రల్ రైలు,  ట్రైన్ నంబరు 12604-చర్లపల్లి-చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 8 నుంచి ఇక్కడి నుంచే ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకు ఈ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై చెన్నై సెంట్రల్ కు వెళ్లేవి. ఇక 7వ తేదీ నుంచి ఈ రెండు రైళ్లు ఇక్కడ నుంచే ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. 

అలాగే ఇప్పటి వరకు ట్రైన్ నంబరు 12589 గోరక్ పూర్–-సికింద్రాబాద్ రైలు ఇక నుంచి గోరక్ పూర్-–చర్లపల్లి పేరుతో .. ట్రైన్ నంబరు 12590 సికింద్రాబాద్–గోరక్ పూర్​రైలు ఇక నుంచి ట్రైన్​నంబర్​12590 చర్లపల్లి–-గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ గా.. ఈ నెల 12, 13 తేదీల నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అలాగే సికింద్రాబాద్-–సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్-ఎక్స్ ప్రెస్, గుంటూరు -సికింద్రాబాద్, సికింద్రాబాద్ -గుంటూరు   ఎక్స్ ప్రెస్ రైళ్లకు చర్లపల్లి టెర్మినల్ లో  ఆగుతాయి.