Modi tour: జూలై 8 నుంచి ప్రధాని మోదీ రష్యా పర్యటన 

Modi tour: జూలై 8 నుంచి ప్రధాని మోదీ రష్యా పర్యటన 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8నుంచి 10 వరకు మూడు రోజుల పాటు రష్యా, ఆస్ట్రియాలో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రి శాఖ గురువారం ( జూలై 4) తెలిపింది. 22వ భారత్ - రష్యా శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించారు.

పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జూలై 8, 9 తేదీల్లో మాస్కలో పర్యటించనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత రాజకీయ,ఆర్థిక, గ్లోబల్ సమస్యలపై చర్చించనున్నారు. ఉక్రెయిన్ పై మాస్కో సైనిక దాడి తర్వాత మోదీ రష్యాలోపర్యటించడం ఇదే తొలిసారి. 

ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోదీ రష్యాపర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా తో బలమైన ఆర్థిక సంబంధాలున్నప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా దాడిని గతంలో భారత్ ఖండించింది. శాంతియుత చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పింది భారత్. 

రష్యాలో జరగనున్న శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. వియన్నాలో ప్రధాని మోదీ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లేతోపాటు ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ తో  సమావేశం అవుతారు. గడిచిన 41 ఏళ్లలో యూరోపియన్ దేశం ఆస్ట్రియాకు వెళ్లిన మొదటి భారతీయ ప్రధాని మోదీనే.