
కొలంబో: భారత ప్రధాని నరేంద్ర మోడీ పొరుగు దేశం శ్రీలంకలో పర్యటించనున్నారు. 2025, ఏప్రిల్ 5న మోడీ శ్రీలంకలో పర్యటిస్తారని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలంగా చేయడంతో పాటు గతేడాది భారత్, శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందాలను ఖరారు చేయడానికి ప్రధాని మోడీ శ్రీలంకకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ట్రింకోమలీలో సాంపూర్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పర్యటనపై గత వారమే ఆ దేశ విదేశాంగ మంత్రి విజిత హెరాత్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు దిస్సనాయక గత సంవత్సరం ఢిల్లీ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను ఖరారు చేయడానికి భారత ప్రధాని శ్రీలంకలో పర్యటిస్తారని తెలిపారు.
ALSO READ | నా జేబులో నుంచి చెల్లిస్తా.. సునీతా విలియమ్స్, విల్ మోర్ ఓవర్ టైం శాలరీపై ట్రంప్
కాగా, శ్రీలంక, భారత్ మధ్య సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. శ్రీలంకలోని ట్రింకోమలీ జిల్లా సాంపూర్‌లో 50 మెగావాట్ల (దశ 1), 70 మెగావాట్ల (దశ 2) సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిలోన్ విద్యుత్ బోర్డు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు ప్రభుత్వాల మధ్య జాయింట్ వెంచర్‌గా నిర్మాణం చేపట్టనున్నాయి. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను ఖరారు చేయడంతో పాటు.. ట్రింకోమలీ జిల్లా సాంపూర్‌లో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.