- మోదీ జపంతో మార్మోగిన సభా ప్రాంగణం
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పీఎం మోదీ టూర్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. పటాన్చెరు పటేల్‌గూడలో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభాప్రాంగణంమార్మోగింది. మంగళవారం పటేల్‌గూడ ఎస్ఆర్ఇన్ఫినిటి గ్రౌండ్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నేతృత్వంలో సభ కొనసాగింది. ఉదయం10.50 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ హెలీప్యాడ్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకోగా కలెక్టర్ వల్లూరి క్రాంతి పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రధానికి స్వాగతం పలికారు.
తర్వాత జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, పలువురు బీజేపీ నేతలు కలిశారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా రూ.7,200 కోట్ల కు సంబంధించిన పనులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన పొలిటికల్ బహిరంగ సభ ప్రాంగణంలోకి ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజల మధ్య నుంచి వచ్చారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ మోదీ.. మోదీ.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Also Read: హైవేకు భూములియ్యం..ఎన్‌హెచ్ 63 భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు
వందేమాతరం నినాదాలతో..
సభకు వచ్చిన ప్రజలు, బీజేపీ శ్రేణులతో ప్రధాని మోదీ వందే మాతరం నినాదం చేయించారు. సభ కొనసాగుతున్నంత సేపు మోదీ నినాదాన్ని మరువని ప్రజలు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అక్కడక్కడా చిన్నారులు మోదీ చిత్రపటాలను ప్రదర్శించారు. ప్రధాని సభ సక్సెస్ కావడంతో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ నాయకులు రెండు స్థానాల్లో బీజేపీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మొత్తం మీద ప్రధాని సంగారెడ్డి జిల్లా టూర్ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. సభకు హాజరైన వారిలో ఎంపీ బీబీపాటిల్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, మురళీయాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలె భాస్కర్, జగన్, చంద్రశేఖర్, సంగమేశ్వర్ పాల్గొన్నారు.