
- వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్య
- ప్రధాని హోదాలో ఫస్ట్ టైమ్ సంఘ్ హెడ్‌క్వార్టర్‌లో అడుగు
- చత్తీస్‌గఢ్‌లోనూ ప్రధాని పర్యటన
- రూ.33వేల కోట్ల పనులకు శంకుస్థాపన
నాగ్‌పూర్: దేశ సంస్కృతికి ఆర్ఎస్ఎస్ ఓ మహావృక్షంలాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృతి ఆధునికీకరణలో సంఘ్ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడ్తున్నదని చెప్పారు. సంఘ్ కార్యకర్తలంతా నిస్వార్థమైన సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్‌కు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ ఫౌండర్ డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఆయన ఫొటోకు నివాళులర్పించారు. 1956లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షభూమిని సందర్శించారు.
అనంతరం ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ మాధవ్‌రావ్ గౌల్వాల్కర్ స్మారకార్థం ఏర్పాటు చేస్తున్న మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘సేవకు ఆర్ఎస్ఎస్ పర్యాయపదం. గత వందేండ్లలో ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు.. సంఘటన్.. సమర్పణ్.. దేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నాయి. మంచి ఫలితాలు అందిస్తున్నాయి. 1925 నుంచి 47 మధ్య స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సంక్షోభకాలమది.
రాజ్యాంగానికి 75 ఏండ్ల వేడుక వేళ.. ఆరెస్సెస్ వందేండ్లు పూర్తి చేసుకుంటున్నది.2025 నుంచి 2047 ఎంతో కీలకం. ఎన్నో ఉన్నతస్థాయి లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. రాబోయే వెయ్యేండ్లకు సంబంధించిన బలమైన, అభివృద్ధి చెందిన దేశానికి పునాది రాయి వేయాలి’’అని మోదీ అన్నారు. అనంతరం అక్కడి విజిటర్స్ బుక్‌లో తన సందేశాన్ని రాశారు. ఎన్నో ఏండ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మాధవ్ నేత్రాలయ సేవలు అందిస్తున్నదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్‌ను సందర్శించిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. 2000లో వాజ్‌పేయి మూడోసారి ప్రధాని అయినప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.
గిరిజనులను కాంగ్రెస్ పట్టించుకోలేదు
కాంగ్రెస్ తీసుకొచ్చిన పాలసీల కారణంగానే గత కొన్ని దశాబ్దాలుగా చత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నక్సలిజం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. 60 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. వెనుకబడిన జిల్లాల పేర్లను ప్రకటించి పక్కకు తప్పుకుందని విమర్శించారు. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాల్లోనే నక్సలిజం పెరిగిందన్నారు. చత్తీస్‌గఢ్‌లో పర్యటించిన మోదీ.. రూ.33,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం బిలాస్పూర్ జిల్లా మోహభట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ చేతగాని పాలన కారణంగా మావోయిస్టుల హింసకు ఓ తల్లి తన కొడుకును.. ఓ చెల్లి తన అన్నను కోల్పోయింది. కాంగ్రెస్ ఉదాసీనత.. అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదే. మేము అధికారంలోకి వచ్చాక స్వచ్ఛభారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ యోజన తీసుకొచ్చాం. రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అందజేస్తున్నాం. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వచ్చాకే చత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి పరుగులు పెట్టింది’’అని మోదీ అన్నారు.