- ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణ
- కలిసికట్టుగా ఉండి వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు
- నైపుణ్యం కలిగిన యువతే దేశ భవిష్యత్తుకు అతిపెద్ద బలం
- ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్నదని కామెంట్
అహ్మదాబాద్: తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దేశ వ్యతిరేకులు (ప్రతిపక్షాలు) సమాజాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. వారి కుట్రలను గ్రహించాలని, ఐక్యంగా ఉండి వారికి బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం గుజరాత్‌లోని వడ్తాల్లో శ్రీ స్వామినారాయణ ఆలయం 200వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని, ప్రసంగించారు. కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే దేశ పౌరుల మధ్య ఐక్యత, దేశ సమగ్రత చాలా ముఖ్యం.
కానీ దురదృష్టవశాత్తు సంకుచిత మనస్తత్వంతో కులం, మతం, భాష, లింగం ప్రాతిపదికన సమాజాన్ని విభజించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అభివృద్ధి చెందడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వ్యతిరేకిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఓబీసీల్లోని కులాలను విభజించేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
దేశాభివృద్ధిలో ఆత్మ నిర్భర్ భారత్ కీలకం
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో ఆత్మనిర్భర్ భారత్ అనేది అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు. స్కిల్స్ ఉన్న యువతే దేశ భవిష్యత్తుకు అతిపెద్ద బలం అని తెలిపారు. విదేశీ పర్యటనల సందర్భంగా తాను ఏ దేశ నేతలను కలిసినా.. వారంతా భారత యువతలో ఉన్న ప్రతిభను ప్రశంసిస్తున్నారని, వారికి తమ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారని చెప్పారు.
2047లోపు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టేందుకు తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఈ బాధ్యతను దేశ పౌరులు కూడా తీసుకోవాలని మోదీ సూచించారు. దేశాభివృద్ధి కోసం బలమైన, విద్యావంతులైన, సమర్థులైన యువతను తయారు చేయాలని స్వామినారాయణ శాఖలోని సాధువులందరినీ అభ్యర్థించారు.