ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఆయన్ను సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలో అవుతుంటారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ప్రధాని మోదీని కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అటు వాట్సాప్ లోనూ మోదీ హవా మామూలుగా లేదు. ఇటీవలే ప్రధాని మోదీ వాట్సాప్ లో తన పేరు మీద ఓ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానెల్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 1 మిలియన్ మంది ఫాలో అయ్యారు. తాజాగా ఈ సంఖ్య 5 మిలియన్లకు చేరుకోవడం విశేషం. దీంతో సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్ ఫాంలలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న భారత రాజకీయ నేతగా ప్రధాని మోదీ నిలిచారు.
వాట్సాప్ ఛానెల్ లో తన ఫాలోవర్ల సంఖ్య 5 మిలియన్లకు చేరుకోవడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక మెసేజ్‌ను పోస్ట్ చేశారు. వాట్సాప్ ఛానెల్‌తో ప్రజలంతా తనతో అనుసంధానమైనందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నానని మోదీ తెలిపారు. నిరంతరం జనం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు చెప్పారు. వాట్సాప్ ద్వారా ప్రజలతో సంభాషణలు కొనసాగిస్తుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం.. అని ప్రధాని మోదీ వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
Also Read :- రోడ్డుపై వజ్రాలు..ఎగబడ్డ జనం..
వాట్సాప్ ఇటీవలే వాట్సాప్ ఛానెల్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు.. వ్యాపార సంస్థల నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ వరకు ఎవరైనా తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో ఈ ఛానెల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పరిచయం చేసిన కొద్ది రోజుల్లోనే దీన్ని ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వాట్సాప్ ఛానెల్ ను ప్రధాని మోదీతో పాటు..ఇతర రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటులు , క్రికెట్ ఆటగాళ్లు ప్రారంభించారు.