నాగ్​పూర్​, విజయవాడ హైవేతో తగ్గనున్న దూరం

  •      హైవేకు ప్రధాని శంకుస్థాపన
  •     జిల్లాలో 25 కి.మీ పొడవునా రహదారి
  •     మూడు భాగాలుగాఎకనామిక్​ కారిడార్  

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు : ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద నాగ్​పూర్​-– విజయవాడ ఎకనామిక్​ కారిడార్​లో భాగంగా వరంగల్–​-మంచిర్యాల జాతీయ రహదారికి ప్రధాని నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు.  ఈ హైవేను రూ.3,441 కోట్లతో నిర్మిస్తునారు. దీనితో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య  దూరం తగ్గనుంది.  

-మంచిర్యాల- –వరంగల్​ మధ్య 112 కి.మీ 

మంచిర్యాల-–వరంగల్​ గ్రీన్​ఫీల్డ్స్​ హైవే పొడవు 112 కి.మీ ఉంటుంది. వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. హైవేకు కేంద్రం 2021  మార్చిలో గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో మంచిర్యాల –-చెన్నూరు నేషనల్​ హైవే 63ను ఆనుకొని  జైపూర్​ మండలంలోని రసూల్​పల్లి పక్క నుంచి   ఎస్టీపీపీ రైల్వే ట్రాక్, ఎల్కంటి, షెట్​పల్లి ఎక్స్​రోడ్​, నర్సింగపూర్, మద్దులపల్లి, కుందారం, కిష్టాపూర్, వేలాల, గోపాలపూర్​ మీదుగా  నిర్మిస్తున్నారు. 

మంచిర్యాల–-పెద్దపల్లి మధ్య గోదావరి నదిపై భారీ బ్రిడ్జి నిర్మిస్తారు.  ఫోర్​లేన్​ నిర్మాణానికి 4 జిల్లాల పరిధిలో 1,767 ఎకరాల భూములను సేకరించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. 

 జిల్లాలో 25 కి.మీ రహదారి..

జిల్లాలో సుమారు 25 కి.మీ పొడవునా రహదారిని నిర్మించనున్నారు. జైపూర్​ మండలంలో ఈ రహదారి ప్రారంభమవుతోంది. రామారావుపేట, ఇందారం, ముదికుంట, నర్వ, టేకుమట్ల, ఎల్కంటి, షెట్​పల్లి, నర్సింగాపూర్​, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్​, కిష్టాపూర్​, వేలాల, గోపాలపూర్​ తదితర 14 గ్రామాల్లో 866 మంది నుంచి 320 ఎకరాల భూములను  రహదారి కోసం సేకరించాల్సి ఉంది. గత యేడాది మార్చిలో  షెట్​పల్లి కేంద్రంగా భూముల సేకరణకు ఆఫీసర్లు  ప్రజాభిప్రాయసేకరణ కూడా చేశారు.  2023 ఫిబ్రవరిలో నిర్వాసిత రైతులకు నోటీసులు జారీ చేశారు. 

అయితే ఆఫీసర్లు ఇప్పటి వరకు పరిహారం కోసం అవార్డు ప్రకటించలేదు. మరోవైపు రసూల్​పల్లె వద్ద నేషనల్​ హైవే 63, గ్రీన్​ ఫీల్డ్​ హైవేను కలుపుతూ జంక్షన్​ ఏర్పాటు చేయనున్నారు.  ఈ హైవే అందుబాటులోకి వస్తే మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల వాసులు వరంగల్​, కొత్తగూడెం, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కనీసం 60 కి.మీ దూరం తగ్గనుంది. దీని వల్ల టైం కలిసి రావడంతో పాటు సరుకుల రవాణా ఈజీ కానుంది. 

ఎకనామిక్​ కారిడార్​కు అనుకూలం…

రూ.14,666కోట్ల వ్యయంతో  కారిడార్​పనులను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా చేపట్టనుంది.  దీనిని ఐదు ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. వాటిలో విజయవాడ– ఖమ్మం, ఖమ్మం– వరంగల్, వరంగల్​-–మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవేలుగా నిర్మిస్తారు.  మంచిర్యాల –రేపల్లెవాడ, రేపల్లెవాడ-–చంద్రాపూర్​ ప్యాకేజీలు బ్రౌన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవేలుగా ఉంటాయి. 

మహారాష్ట్రలోని చంద్రాపూర్​ నుంచి నాగ్​పూర్​ వరకు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్​ప్రెస్​ హైవేను ఈ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ కారిడార్​ పొడవు మొత్తంగా 400 కి.మీగా ఉంది.  తెలంగాణ లో 370 కి.మీ, తెలంగాణ సరిహద్దు   నుంచి విజయవాడకు 30కి.మీ  హైవేను నిర్మించనున్నారు.    మంచిర్యాల–-చంద్రాపూర్​ నేషనల్ హైవేను  నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు  కేంద్రం 2018లో రూ.2,407 కోట్లు కేటాయించింది.

ఇప్పటికే ఇందారం క్రాస్​ రోడ్డు నుంచి తాండూరు మండలం రేపల్లెవాడ వరకు రూ.1,356.90 కోట్ల వ్యయంతో 42 కి.మీ  ఫోర్​లేన్​ రోడ్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. రేపల్లెవాడ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు వరకు రెండో ఫేజ్​ పనులు నడుస్తున్నాయి.