ప్రధాని నరేంద్ర మోడీ క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు రేపు జపాన్ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిద, స్కాట్ మారిసన్‌లతో సమావేశం కానున్నారు. జపాన్ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు మోడీ టోక్యో వెళ్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ సమస్యలు, ఇండో- పసిఫిక్ ప్రాంత పరిణామాలు, క్వాడ్ దేశాల ఉమ్మడి అంశాలపై అగ్రనేతలు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకునేందుకు. భవిష్యత్తు కార్యాచరణపై సదస్సులో చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జపాన్ పర్యటనలో భాగంగా మోడీ 40 గంటలు ఆ దేశంలో గడుపనున్నారు. ఈ సమయంలో ఆయన మొత్తం 23 సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్ కు చెందిన 30 మంది సీఈవోలు, దౌత్యవేత్తలు, అక్కడ స్థిరపడిన భారతీయులతో మోడీ సమావేశమవుతారు.