
న్యూఢిల్లీ: నూతన విద్యా విధానం, హిందీ భాషకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమిళులంతా మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ వైపు స్టాలిన్ కేంద్రంతో యుద్ధానికి దిగుతుంటే.. మరోవైపు ప్రధాని మోడీ మాత్రం స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి 1న తమిళనాడు సీఎం స్టాలిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగానే ప్రధాని మోడీ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. ‘‘తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు . ఆయన దీర్ఘాయుష్షుతో జీవించాలి" అని పోస్ట్ చేశారు మోడీ. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ నిత్యం విమర్శల వర్షం కురిపిస్తుండగా.. ప్రధాని మోడీ మాత్రం అవేమి మనసులో పెట్టుకోకుండా బీజేపీ బద్ధ శత్రువుకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. ప్రధాని మోడీ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ హుందాగా వ్యవహరించారని.. రాజకీయాలు వేరు.. వ్యక్తిగతం జీవితం వేరని ఆయన నిరూపించారని కొనియాడుతున్నారు.