–మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ తెలిపారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో మేడారం ఒకటి. సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలుస్తుంది. మేడారం జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక . మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదామని మోదీ ట్వీట్ చేశారు.
తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతర ఫిబ్రవరి 21న ప్రారంభమైంది. పైడిద్దరాజు మేడారం బయల్దేరాడు.బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి.