మీరు క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నాం: సునీతా విలియమ్స్‎కు ప్రధాని మోడీ ఎమోషనల్ లెటర్

మీరు క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నాం: సునీతా విలియమ్స్‎కు ప్రధాని మోడీ ఎమోషనల్ లెటర్

న్యూఢిల్లీ: అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్నారు. దాదాపు 9 నెలలుగా స్పేస్‎లోనే గడిపిన సునీతా విలియమ్స్‎ను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. క్రూ 10 మిషన్ ద్వారా సునీతా విలియమ్స్ ఆమె తోటి ఆస్ట్రోన్యాట్ బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. ఈ తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సునీతా విలియమ్స్ భావోద్వేగ లేఖ రాశారు. అంతరిక్షం నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్ జాగ్రత్తగా భూమి మీదకు రావాలని మోడీ ఆకాంక్షించారు. 

“భారత ప్రజల తరుఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక కార్యక్రమంలో నేను ప్రముఖ ఆస్ట్రోన్యాట్ మైక్ మాసిమినోను కలిశాను. మా సంభాషణ సమయంలో మీ పేరు (సునీతా విలియమ్స్) ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా మేము మీ గురించి, మీ పని గురించి ఎంత గర్వపడుతున్నామో డిస్కస్ చేశాం. 1.4 బిలియన్లకు పైగా భారతీయులు మీ విజయాలను చూసి ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తున్నారు. 

ఇటీవలి పరిణామాలు మీ స్ఫూర్తిదాయకమైన ధైర్యం, పట్టుదలను మరోసారి ప్రదర్శించాయి. సునీత విలియమ్స్ వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయులు ఆమె హృదయాలకు దగ్గరగా ఉన్నారు.. భారతదేశ ప్రజలు ఆమె ఆరోగ్యం, క్రూ 10 మిషన్‌ విజయం కోసం ప్రార్థిస్తున్నారు. మీరు అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో పర్యటించండి. మిమ్మల్ని చూడటానికి మేము ఎదురుచూస్తున్నాం. భారతదేశం తన ప్రముఖ కుమార్తెలలో ఒకరికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంటుంది” అని పేర్కొన్నారు మోడీ. 

ALSO READ | అంతా ‘ఛావా’ మూవీ వల్లే.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్ సంచలన కామెంట్స్

కాగా,10 రోజుల మిషన్‎లో భాగంగా 2024,  జూన్‎ 5న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‎ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే.. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌ షిప్‎కు అంతరిక్షంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ స్పేస్ నుంచి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు తొమ్మది నెలలు ఈ ఇద్దరూ  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్నారు. వీరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేయగా అవేవి ఫలించలేదు. దీంతో ఈ ఆస్ట్రోనాట్ల జోడీని భూమి పైకి తీసుకువచ్చే మిషన్ వాయిదా పడుతూ వస్తోంది. 

ఈ క్రమంలో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‎ను తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించడంతో నాసా దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే 2025, మార్చి 18న ఇద్దరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం (మార్చి 19) తెల్లవారుజూమున 3 గంటల ప్రాంతంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్‌ ద్వారా సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి మీదకు రానున్నారు.