న్యూఢిల్లీ: హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడోసారి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ హ్యాట్రిక్ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోనూ బీజేపీ సత్తా చాటింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగిన కమలం పార్టీ.. జమ్మూలో గతం కంటే మెరుగైన ఫలితాలు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో కాషాయ పార్టీ అగ్రనేత, ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. హర్యానా, జమ్మూలో విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోడీ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. హర్యానాలో మూడోసారి విజయం సాధించాం.. జమ్మూ కాశ్మీర్లో గతం కంటే బాగా పుంజుకున్నామని తెలిపారు.
పార్టీ గెలుపు కోసం కష్టపడిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ కార్యకర్తలకు అభినందనలు చెప్పారు. ముఖ్యంగా హర్యానాలో బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. హర్యానాలో విజయానికి పార్టీ అధ్యక్షుడు, సీఎం నాయబ్ సింగ్ సైనీ కృషే ముఖ్యకారణమని పేర్కొన్నారు. హర్యానాలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా.. ప్రజలు 10 సార్లు ప్రభుత్వాన్ని మార్చారని గుర్తు చేసిన మోడీ.. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే హర్యానాలో వరుసగా మూడోసారి విజయం సాధించామని అన్నారు. అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజల గుండెల్లో నిలిచామని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హర్యానా ప్రజలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయాలను ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. తద్వారా అసలైన దేశభక్తులమని హర్యానా ప్రజలు రుజువు చేశారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దేశ వికాసానికి అడ్డువచ్చేవారిని హర్యానా ప్రజలు పక్కకు తప్పించారని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, గోవాలోనూ మూడో సారి ప్రజలకు బీజేపీకి పట్టం కట్టారు.. అసోం, ఉత్తరాఖండ్‌లోనూ మాకు రెండోసారి అధికారం ఇచ్చారని గుర్తు చేశారు . బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మళ్లీ మళ్లీ మాకు మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వరుసగా రెండోసారి ఎక్కడ అధికారంలోకి రావడం లేదని సెటైర్ వేశారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు చాలా దూరంగా ఉంచారు.. మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు కేవలం వారసత్వ, కుటుంబ రాజకీయాలపై ఆధారపడ్డారని విమర్శించారు.